logo

కడపటి వీడ్కోలుకు కదిలొచ్చిన జనం అశ్రునయనాల మధ్య పోటు ప్రసాద్ అంతిమ యాత్ర అమర్ హై నినాదాల మధ్య మమత వైద్య కళాశాలకు పార్దివ దేహం

ఖమ్మం: కడ వరకు కమ్యూనిస్టుగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చి కమ్యూనిస్టు ఉద్యమ భవిష్యత్తుపై ఆశలు రేపిన సమరసేనాని పోటు ప్రసాద్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయనకు కడపటి వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కమ్యూనిస్టు శ్రేణులు, వామపక్ష అభిమానులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు కదిలొచ్చారు. అమర్ హై పోటు ప్రసాద్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి హృదయం బరువెక్కింది. పోటు ప్రసాద్ తమకున్న అనుబంధాన్ని లోలోపలే గుర్తు చేసుకుంటూ కళ్లు చెమరుస్తుంటే అరుణ పతాకం చేబూని అడుగులేశారు. బుధవారం మరణించిన సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అంతిమ యాత్ర శుక్రవారం ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్ నుంచి ప్రారంభమైంది. ప్రజల సందర్శనార్థం పార్దివ దేహన్ని పార్టీ కార్యాలయానికి తరలించిన నేతలు సంతాప సభ అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. పోటు ప్రసాద్ 64 సంవత్సరాల వయస్సుకు సంకేతంగా 64 అరుణపతాకాలను చేబూనిన యువ దళం ముందు నడవగా ఆ తర్వాత డప్పు దళం, పార్టీ నాయకత్వం, కుటుంబ సభ్యులు ర్యాలీగా కదిలారు. బైపాస్ రోడ్డు, ఆర్టివో కార్యాలయం, గట్టయ్య సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు, ఐటి హబ్ సెంటర్, మమత రోడ్డు మీదుగా ర్యాలీ మమత మెడికల్ కళాశాలకు చేరుకుంది. దారి పొడవునా జనం ప్రసాద్కు నివాళులర్పించారు. సమకాలిన రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటి ఖమ్మంజిల్లా రాజకీయాలలోనూ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ యవనిక పైన తనదైన ముద్రవేసిన పోటు ప్రసాద్కు ఘనమైన వీడ్కోలు లభించింది. ఇటీవల కాలంలో ఏ రాజకీయ నేత మరణానికి జనం ఇంతగా స్పందించలేదంటే అతిశయోక్తి కాదు. విద్యార్థి ఉద్యమం నుంచి ఎర్రజెండాతో పెనవేసుకున్న ఆయన బంధం, త్యాగాలకు చిరునామాగా మారిన ఆయన కుటుంబం వెరసి ప్రసాద్ను ఉద్యమ పదంలో ఒక వేగుచుక్కలా నిలిపింది. బరువెక్కిన హృదయాలు అమర్ హై నినాదాలతో ముందుకు సాగాయి. ప్రసాద్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్దివ దేహన్ని మమత మెడికల్ కళాశాలకు అప్పగించారు. మమత వైద్య విద్యా సంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ కుటుంబ సభ్యుల నుంచి అశ్రునయనాల మధ్య స్వాధీనపర్చుకున్నారు. మమత సంస్థలకు అంకురార్పణ చేసిన వారిలో పోటు ప్రసాద్ ఒకరని పోటు ప్రసాద్, పువ్వాడ ఉదయ్ కుమార్ బంధాన్ని జయశ్రీ గుర్తు చేసుకున్నారు. ఉదయ్, ప్రసాద్ అనుబంధాలకు గుర్తుగా ఉదయ్ చిత్ర పటం సాక్షిగా ప్రసాద్ పార్దివ దేహన్ని వైద్య విద్యార్థుల పరీక్షల కొరకు అప్పగించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్పాషా, పోటు ప్రసాద్కు అత్యంత ఆప్తులుగా ఉన్న దండి సురేష్, మహ్మద్ మౌలానా, బి. అయోధ్య, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె జానిమియా, గోవిందరావు, పలువురు యువ నేతలు ఆయన పార్దివ దేహాన్ని మోశారు. ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. బాలమల్లేష్, ప్రజా సంఘాల బాధ్యులు, వివిధ జిల్లాల సిపిఐ కార్యదర్శులు, కుమారుడు సాత్విక్, తల్లి సక్కుబాయి, సతీమణి నిర్మల, సోదరి, సోదరులు పాల్గొన్నారు.

0
2496 views