logo

దేశానికి ఎర్రజెండానే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయాకపోతే పోరాటాలకు సిద్ధం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సుజాత నగర్ మండల మహాసభలు స్థానిక వేపల గడ్డ గ్రామంలో సీతారాం ఏచూరి నగర్ గుగులోత్ ధర్మ ప్రాంగణంలో నిర్వహించారు.మహాసభలకు ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరై మాట్లాడుతూ దేశానికి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అని కమ్యూనిస్టుల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజా పునాదిని విస్తరింపజేసేలా, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణం లక్ష్యంగా పార్టీ నిర్మాణం పటిష్టం చేయడానికి అన్ని స్థాయిల్లో కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తున్నాయన్నారు. బిజెపి,ఆర్ఎస్ఎస్ తదితర హిందూ మతోన్మాద శక్తులు వామపక్ష నాయకుల పైన, ప్రజాతంత్ర వాదుల పైన దాడులు చేస్తున్నారని ఈ తరుణంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమనీ, కార్పోరేట్లకు పన్ను మినహాయింపులిస్తూ, పేదల నుండి పెద్ద మొత్తంలో పనులు వసూలు చేస్తున్నారని అన్నారు. అదానీని కాపాడటం కోసం మోడీ ఉవ్విళ్లూరుతున్నారు అని విమర్శించారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో, నిత్యవసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగం,పేదరికం, అవినీతి, దోపిడీ, పీడన, అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయన్నారు. పేదలు, అభివృద్ధికి అత్యంత దూరంగా ఉన్న దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన సామాజిక తరగతులకు చేస్తున్న అన్యాయం, కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వ సంపద, వనరులను దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. గడిచిన పదేళ్ల కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీచేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. అసమానతల్లేని అభివృద్ధి కోసం దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఉద్యమిస్తోందని ,కేంద్రంలో బిజెపి ఇచ్చిన వాగ్ధానాలేవీ అమలు చేయడం లేదని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తీసుకు రాకుండా, ఎన్‌ఇపి పేరుతో కేంద్రం పేదలకు విద్యను దూరం చేయాలని చూస్తోందని విమర్శించారు. మరోవైపు ఉపాధి హామీ నిధుల్లో కోత విధిస్తూ నిర్వీర్యానికి కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, రైతులకు సాగు నీరు అందించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీల పేరుతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ఇల్లు లేని పేదలందరికీ ప్రభుత్వ ఇండ్లు ఇవ్వాలని, ఇండ్ల స్థలం లేని పేదలందరికీ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ అన్నవరపు సత్యనారాయణ, భూక్యా రమేష్ మండల కార్యదర్శి వీర్ల రమేష్ నాయకులు ముదిగొండ రాంబాబు నాగేశ్వరరావు యాసా నరేష్ వెంకటరత్నం కాట్రాల తిరుపతిరావు నర్రా శివరామకృష్ణ బచ్చలికూర శ్రీను చప్పిడి వెంకటేశ్వర్లు కుమారి శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

3
1799 views