ఈరోజు ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞురాలు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత రామన్ పరిమళ పుట్టినరోజు
రామన్ పరిమళ (జననం 21 నవంబరు, 1948) ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞురాలు. ఆమె బీజగణితానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. ఆమె ఎమోరీ యూనివర్శిటీలో ఆర్ట్స్ & సైన్సెస్ విశిష్ట గణిత ప్రొఫెసర్. చాలా సంవత్సరాలు ఆమె ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె 2019 నుండి ఇన్ఫోసిస్ ప్రైజ్ ( Infosys Prize ) కోసం మ్యాథమెటికల్ సైన్సెస్ జ్యూరీలో ఉన్నారు. 2021/2023 అబెల్ ప్రైజ్ ( Abel Prize) సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఆమె నంబర్ థియరీ, ఆల్జీబ్రాయిక్ జామెట్రీ, టోపాలజీలను ఆమె తన పరిశోధనలో ఉపయోగించి ఆల్జీబ్రాలో అద్భుతమైన కృషి చేశారు.
పరిమళ తమిళనాడులో 21 నవంబరు 1948 లో మయూరంలో జన్మించారు. తండ్రి శ్రీనివాసన్ ఆంగ్ల సాహిత్యంలో ప్రొఫెసర్. ఆమె శారదా విద్యాలయ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో బిఎస్సీ (1968), ఎమ్మెస్సీ (1970) లను పూర్తి చేశారు. ముంబై విశ్వవిద్యాలయం నుండి Ph.D (1976) చేశారు. ఆమె డాక్టోరల్ సలహాదారు R. శ్రీధరన్ (TIFR). 1999 లో యూనివర్సిటీ ఆఫ్ లాసాన్, స్విట్జర్లాండ్ నుంచి ఆనరరీ డాక్టరేట్ పొందారు. మద్రాసు రామానుజన్ ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ డాక్టోరల్ అధ్యయనాలు చేశారు. అసోసియేషన్ ఆఫ్ విమెన్ మ్యాథమెటిషియన్ ఆమెను నోదర్ లెక్చరర్ ( Noether Lecturer) గా గౌరవించింది.
కెరీర్:
పరిమళ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో రీసెర్చ్ ఫెలో గా తన సేవలను ప్రారంభించారు. 2005 నుండి అమెరికాలోని ఎమొరీ యూనివర్సిటీలో ఆషా గ్రిగ్స్ క్యాండ్లర్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గా పదవిని స్వీకరించారు.
పరిశోధన:
డాక్టర్ రామన్ పరిమళ అత్యంత శక్తివంతమైన ఆల్జెబ్రాయిస్ట్ (algebraist) గా అంతర్జాతీయ ఖ్యాతిగాంచారు ఆమె నంబర్ థియరీ, ఆల్జీబ్రాయిక్ జామెట్రీ, టోపాలజీలలో విశేషంగా కృషి చేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో ఆమె అఫైన్ ప్లేన్‌పై నాన్‌ట్రివియల్ క్వాడ్రాటిక్ స్పేస్‌కు మొదటి ఉదాహరణను ప్రచురించారు. ఈ ఫలితం చాలా మంది నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఈ రంగంలో మరింత అభివృద్ధికి దారితీసింది. ఆమె లీనియర్ బీజగణిత సమూహాల క్రింద సజాతీయ స్పేసెస్ పై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఇది అంకగణితం మరియు జ్యామితి దృక్కోణం నుండి గొప్పది. అంకగణిత అంశంలో క్వాడ్రాటిక్ మరియు హెర్మిషియన్ రూపాలు, డివిజన్ ఆల్జెబ్రాస్ ఆక్టోనియన్ మరియు ఆల్బర్ట్ బీజగణితాలు వంటి ఆసక్తికరమైన బీజగణిత నిర్మాణాల వర్గీకరణ ఉంటుంది. థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్స్ (TWAS) 20 సంవత్సరాల ప్రారంభ చరిత్రలో గణితం లేదా భౌతిక శాస్త్రంలో సాధించిన విజయాల కోసం మొదటిసారిగా ఒక మహిళకు అవార్డును అందజేసింది. సెర్రాస్ కంజెక్చర్ యొక్క క్వాడ్రాటిక్ అనలాగ్‌పై ఆమె చేసిన కృషికి పరిమళకు TWAS అవార్డు లభించింది.
పరిమళ స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ లాసాన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూనివర్సిటీ ఆఫ్ పారిస్ లలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేశారు.
2020లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా , భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధిపతి స్మృతి ఇరానీ రామన్ పరిమళ మరియు ఇతర పది మంది భారతీయ మహిళా శాస్త్రవేత్తల పేర్లతో భారతదేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో చెయిర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె 1958లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్ (ICM) కు ఆహ్వానితురాలు. పరిమళ 1994లో జ్యూరిచ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్‌లో ఆహ్వానించబడిన వక్తగా ఉన్నారు. టాపిక్: Study of quadratic forms — some connections with geometry. ఆమె 2010లో హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ ప్రసంగాన్ని అందించారు. టాపిక్: Arithmetic of linear algebraic groups over two dimensional fields.
పరిమళ గణిత జర్నల్స్‌లో అనేక పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఆమె జీవిత చరిత్ర 'మ్యాథమెటిక్స్ జీనియాలజీ ప్రాజెక్ట్‌లో చేర్చబడింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 'పరిశోధన స్థాయి గణితశాస్త్రం'లో కృషి చేసిన 160000 మంది ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్తలకు సంబంధించిన సమాచారం ఉంది.
అవార్డులు, గౌరవాలు:
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలో
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలో
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలో
1987లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
1999లో లాసాన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
2003లో శ్రీనివాస రామానుజన్ బర్త్ సెంటెనరీ పురస్కారం
2004 లో జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటెనరీ లెక్చర్ అవార్డు
2005లో TWAS ప్రైజ్ ఫర్ మేథమెటిక్స్
2012లో అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ ఫెలో..
మూలం: ఉమెన్స్ సైంటిస్ట్ వార్ రూమ్, సోషల్ మీడియా, వికీపీడియా