logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉచిత మధుమేహ పరీక్షలు

తేదీ: 14-11-2024:ఈరోజు ఉదయం ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్ సమీపమున గల PJR స్టేడియం నందు ఉదయం గం. 6.15 ని. నుండి గం. 9.45 ని. వరకు ఉచిత మధుమేహ, రక్తపోటు మరియు పల్స్ పరీక్షలు సిటిజన్ హాస్పిటల్స్, నల్లగండ్ల వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *ఈరోజు 170 దేశాలలో మధుమేహ వ్యాధి వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు మరియు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్యాధి సుమారు వంద కోట్ల ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోంది. మధుమేహం మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే గ్లూకోజును ప్రాసెస్ చేయడంలో మరియు వినియోగించుకోవడంలో శరీరము విఫలమయ్యే రుగ్మతే _డయాబెటిక్ వ్యాధి_ "* అని అన్నారు.

" *మారుతున్న జీవనశైలి కారణంగా దాదాపుగా ప్రతి కుటుంబంలో ఒక డయాబెటిక్ పేషంటు ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇది సైలెంట్ కిల్లర్. శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతూ మనిషి ఆయుష్షును తగ్గిస్తూ ఉంది. ఇది దీర్ఘ కాలిక వ్యాధి. ఈ వ్యాధి వలన ఆర్థిక, ఆరోగ్య, ప్రాణనష్టం జురుగుతూ ఉంది. నష్టనివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ సంయుక్తంగా వ్యాధిని అదుపులో ఉంచేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 14వ తేదీన ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం ' _అడ్డంకులను బద్దలు కొట్టడం - అంతరాలను తగ్గించడం'_ . ఈ రోజున నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇన్సులిన్ మందును కనిపెట్టిన ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టిన రోజు ఈరోజు కావడం. కావున ఆయన గౌరవార్ధం ఈరోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్యాధి మూడు రకాలు.*
*టైప్ 1. ఎక్కువగా పిల్లలకు వస్తూ ఉంటుంది.*
*టైప్ 2. పెద్ద వయసు వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.*
*మూడవది. జెస్టీషనల్ డయాబెటిస్. ఇది మహిళలకు గర్భము దాల్చిన సమయంలో వస్తూ ఉంటుంది.*
*ఈ వ్యాధి వలన గుండె జబ్బులు, నరాలు దెబ్బతినడం, మూత్ర పిండాలు దెబ్బతినడం, కంటిచూపు తగ్గిపోవడం, అరికాళ్ళు స్పర్శ కోల్పోవడం, చర్మవ్యాధులకు గురికావడం, పురుషులకు అంగస్తంభన జరగకుండా పోవడం, నిరాశకు గురి కావడం, రక్తపోటు, దంత సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు.*
*1. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళవలసి రావడం.*
*2. కంటి చూపు మందగించడం.*
*3. ఆకస్మికముగా బరువు తగ్గడం లేదా పెరగడం.*
*4. విపరీతమైన దాహం వేయడం.*
*5. నీరసంగా ఉండటం.*
*6. ఎక్కువ ఆకలి వేయడం.*
*7. నోరు, గొంతు ఎండిపోయినట్టు అనిపించడం.*
*8. చేతులు మరియు కాళ్లకు స్పర్శ తెలియక పోవడం.*
*9. చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి కనిపించడం.*
*10. చర్మం పొడిబారడం.*
*11. దురదలు రావడం.*
*12. వినికిడి లోపం ఏర్పడటం.*
*13. మానసిక అశాంతి* .
*14. శరీరంలో కొన్ని ప్రదేశాలలో చర్మం రంగు మారి దళసరి కావడం మొదలగునవి.*

*వ్యాధి నివారణకు సమతుల్యమైన జీవనశైలినీ పాటించాలి. పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతి రోజు మందులు వాడాలి. అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లీన్ ప్రొటీన్లు, ఆరోగ్య కరమైన క్రొవ్వులు ఉన్న ఆహారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. యోగా, ధ్యానం, ఏరోబిక్ వ్యాయామం చేయాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా వాడాలి. భోజనం విషయంలో సమయపాలన పాటించాలి. మనం తీసుకునే ఆహారం ఒక్కసారే కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తృణధాన్యాలను ఎక్కువగా వినియోగించాలి. సాధారణ టీ, కాఫీలను తగ్గించి లెమన్ టీ లేదా అల్లం టీ త్రాగితే మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులున్న దేశాలలో మన దేశం రెండవ స్థానంలో ఉంది. ఆరోగ్యమే మహా భాగ్యము కావున కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గం" అని పేర్కొన్నారు. "సాధారణ షుగర్ లెవెల్స్ 70 నుండి 100. అలాగే భోజనం చేసిన రెండు గంటల తరువాత 70 నుండి 130. HBA1C (మూడు నెలల సరాసరి) 6.5 ఉన్నయెడల వ్యాధి అదుపులో ఉన్నట్లే అని వైద్యనివేదికలు తెలుపుతున్నాయి"* అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్ మల్లేష్, ఉమా చంద్రశేఖర్, జనార్ధన్, అమ్మయ్య చౌదరి, పాలం శ్రీను మరియు హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

29
4064 views