logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ "జాతీయ విద్యా దినోత్సవము"

తేదీ: 11-11-2024,శేరిలింగంపల్లి:ఈరోజు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర భారతావని తొలి విద్యశాఖామాత్యులు, భారతరత్న అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్టుమెంటుకు చెందిన ఆచార్య రావుల కృష్ణ గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శి మరియు విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాద్ గారు"* అని కొనియాడారు. " *ఆజాద్ గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. స్వాతంత్రోద్యమంలో పది సంవత్సరముల కారాగార శిక్షను అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆజాద్ గారు పండితుడు, కవి, సంపాదకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు* " అని అన్నారు. " *ఆయన బహుభాషా కోవిదుడు (అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ). ఆయన స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వములో 11 సంవత్సరముల పాటు విద్యశాఖామాత్యులుగా కొనసాగి విద్యా సంస్కరణలకు విశేష కృషి చేశారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యలో ప్రగతి సాధించాలని భావించి 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు అలాగే 1952లో సెకండరీ విద్యకోసం ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. విద్యశాఖమాత్యులుగా పనిచేసిన తొలి అయిదేళ్ళ కాలంలోనే UGC, ICCR, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఖరగ్ పూర్ లో తొలి IIT ఏర్పాటు చేశారు. వీటితో పాటు సంగీత, సాహిత్య, లలితకళల సర్వతోముఖాభివృద్ధికి అకాడమీలను నెలకొల్పారు. స్వయంప్రతిపత్తి సంస్థలైన భారతీయ సంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆరట్స్ అకాడమీలను స్థాపించారు. చిన్నపిల్లలకు 6 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల వరకు ఉచిత నిర్బంధవిద్య ఉండాలని, అలానే ముఖ్యంగా బాలికలు విధిగా పాఠశాలలకు వెళ్ళాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆయన హిందూ ముస్లింల ఐక్యతకు కూడా కృషి చేశారు. ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో మన దేశ అత్యున్నత పురస్కారమైన _భారతరత్న_ తో గౌరవించి ఆయన జన్మదినమైన నవంబరు 11ను 2008వ సంవత్సరము నుండి జాతీయ విద్యా దినోత్సవముగా ప్రకటించి అమలుచేయడం జరుగుతుంది"* అని అన్నారు. *"నేటి విద్యా విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. "అంతర్జాతీయంగా అంతర్జాలం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. విద్యా విధానంలో వస్తున్న నూతన సాంకేతికతను ఆకళింపు చేసుకొని ప్రపంచస్థాయి విద్యార్థులతో ధీటుగా మన విద్యార్థులు కూడా రాణించాలంటే కృషి, పట్టుదల, ఏకాగ్రతలతో పాటు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకోవాలి. ఒక వ్యక్తి, ఒక పుస్తకం లేదా ఒక కలము వీటికి దేశ భవిష్యత్తును మార్చ గలిగే శక్తి ఉంది. సంస్కారముతోనే విద్య అబ్బుతుంది. విద్యతో పాటు నూతన వృత్తి నైపుణ్యాలను కూడా నేర్చుకోవాలి. భాషాపరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. చేతి వ్రాతను బాగా అభ్యాసం చేయాలి. అలాగే పుస్తక పఠనం చేశారు. నేటి విద్యార్థులే నేటి పౌరులు. నేటి విద్యార్థులు అంతర్జాలానికి ఆకర్షితులై వారి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అవసరమైనంత వరకే అంతర్జాలాన్ని ఉపయోగించుకోవాలి"* అని కోరారు. " *చెడు అలవాట్లకు (ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం) దూరంగా ఉండాలి. పౌష్టికాహారం తీసుకుంటూ నిత్య వ్యాయామం, ధ్యానం ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకొని అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అంది పుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశాభివృద్ధికి పాటు పడటంతో పాటు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయడమే మనము ఆయనకు అర్పించే నిజమైన నివాళి"* అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి P.అనురాధ, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, పాలం శ్రీను, జిల్ మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

83
4858 views