logo

మనం పూర్వ జన్మలలో చేసిన పుణ్యపాపములే ఈ జన్మలో అనుభవింపవలసిన సుఖ దుఃఖములు. దానినే ప్రారబ్ధం అంటారు. -తూములూరి మధుసూదనరావు.


మనం పూర్వ జన్మలలో చేసిన పుణ్యపాపములే ఈ జన్మలో అనుభవింపవలసిన సుఖ దుఃఖములు. దానినే ప్రారబ్ధం అంటారు. దీనికి మూలకారణం మనలోని రాగ ద్వేషములు. ఆ రాగద్వేషములకు కారణం "అజ్ఞానం". అజ్ఞానం వల్ల రాగ, ద్వేషములతో ప్రేరేపింపబడి, జన్మ, జన్మాంతరములలో, అసంఖ్యాకంగా చేసిన కర్మల ఫలితములు ఈ జన్మలోను, రాబోయే జన్మలలోను, మనం అనుభవించవలసి ఉంది.

శ్రీ జైమిని మహర్షి ఇలా అంటున్నారు.

ప్రారబ్ధకర్మలోని పాపకర్మలు దుఃఖాన్ని ఇస్తాయి. ఆ దుఃఖం ఇష్ఞవస్తువులతోను,జీవులతోను, వియోగరూపంలోను, ఇష్టంలేని వాటితో సంయోగం రుపంలోను ఉంటుంది.
(వార్ధక్యము, వ్యాధులు, మరణము ఈ కోవకు చెందినవే)


శ్లో// లబ్ధానిష్ట సహస్రస్య,నిత్యమిష్ట వియోగిన:/
హృద్రోగం మమ దేవేశ హరిమాణం చ నాశయ//

ఓ ఈశ్వరా! నేను నిత్యము వేలకొలది అనిష్టములను (ఆపదలను) పొందుచున్నాను. మనస్సుకు ఇష్టమైన విషయములతో నిత్యము వియోగము అనుభవిస్తున్నాను. హృదయ దౌర్బల్య కారణము,జ్ఞాన విజ్ఞాన నాశకము అయిన నా అజ్ఞానమును పోగొట్టుము, అని 'వేదపాదస్తవము' లో శ్రీ జైమినిమహర్షి, ఈ శ్వరుని ప్రార్ధిస్తున్నారు. సమస్త కర్మలకు మూలం రాగ, ద్వేషములు. రాగ ద్వేషములన్నా, కామ క్రోధములన్నా, ఇష్టానిష్టములన్నా, ప్రియా ప్రియములన్నా అన్నీ సమానార్ధకాలే. వాటిని జయించాలని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో "జహి శత్రుం, మహాబాహో, కామరూపం దురాసదమ్"
ఓ మహాబాహువుడవైన అర్జునా! జయించడానికి అసాధ్యమైన ఈ కామము (అందులోనుండే క్రోధం పుడుతుంది కాబట్టి కామమే ప్రధాన శత్రువు) అనే శత్రువును నాశనము చేయుము, అని అర్జునునితో అంటాడు.

శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు.
" తండ్రీ! శ్రీకాళహస్తీశ్వరా! అజ్ఞానం వల్ల మేము సంసారంలో పూర్తిగా మునిగి ఉన్నాము. మమ్మల్ని అనుగ్రహించు. దృఢంగా బిగింపబడిన ఈ సంసార బంధములనుండి, నీ దయ లేకుండా మేము బయట పడలేము.

శా / ఆలంచున్ మెడ గట్టి, దానికి నపత్యశ్రేణి గల్పించి తత్/
బాల వ్రాతము నిచ్చి పుచ్చుటను సంబంధంబు గావించి యా/
మాలర్కంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పగా/
సీలన్ సీల యమర్చి నట్లొసగితో! శ్రీకాళహస్తీశ్వరా!//

స్వామీ! భార్యాభర్తలనే సంబంధం మెడకు కట్టావు. సంతానాన్ని కనటం అనే ప్రక్రియ ఏర్పాటు చేసావు. ఆడపిల్లలను ఇవ్వడం, కోడండ్రను,తెచ్చుకోవడం, అనే తతంగంతో క్రొత్త క్రొత్త బాంధవ్యాలు, ప్రేమలు కల్పిస్తున్నావు.

ఈ విధంగా మానవులను నిర్విరామంగా సంసారంలో త్రిప్పటం అనేది, మరలలో మేకులను గట్టిగా బిగించినట్లు ఉన్నది. సీలలో సీలలాగా బిగింపబడిన ఈ బంధములనుండి మా అంతట మేము ఎలా బయటపడగలం?
శ్రీకాళహస్తీశ్వరా! నీవే దయతో ఈ బంధములనుండి విముక్తులను చేసి మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ! అంతేకాదు మేము ప్రయత్నం చేసి కామ, క్రోధములను ఎప్పటికీ జయించలేము. నీ నామ జపమే సమస్త పాపములను నశింపజేసి, ధర్మార్థకామ మోక్షములను ప్రసాదిస్తుంది అని పెద్దలంటున్నారు.

శా//నిప్పై పాతక తూల శైల మడచున్, నీ నామమున్ మానవుల్/
తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధత క్లేశముల్/
తప్పుం దారును ముక్తులౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్/
చెప్పంగా దమ కింక శంక వలెనా శ్రీ కాళహస్తీశ్వరా!//

ఓ శ్రీకాళహస్తీశ్వర స్వామీ! "శివ" అను నీ నామము తెలిసి గాని, తెలియకుండా గాని కేవలము ఉచ్చరించినా, దూరమునుండి విన్నా, అగ్ని , దూది రాసులను దహించునట్లు సమస్త పాపములను నశింపజేస్తుంది. దర్పంతో యముడు పెట్టే బాధలనుండి విముక్తి లభిస్తుంది. మోక్షము లభిస్తుంది. అని శాస్త్రములు, మహాపండితులు చెప్పుచున్నారు. అయినా ఈ జనులకు ఇంకా సందేహమెందుకో అర్థం కావటం లేదు. తండ్రీ! మా సందేహాలు తొలగించి మమ్మల్ని అనుగ్రహించు.

అందువలన నిరంతర శివనామ స్మరణతో అందరము తరించెదముగాక !

శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.

32
3942 views