logo

శ్రీ జనార్ధనస్వామివారి జన్మదినం సందర్భంగా వారికి భక్తిపూర్వకముగా ప్రణామములు సమర్పించి వారి అనుగ్రహపాత్రులమవుదాము.

ఆశ్వీయుజ బహుళ సప్తమి.
స్వామి వారి జన్మదినం సందర్భంగా, ఆ పుణ్యమూర్తులను స్మరించి,తరిద్దాము.
శ్రీ జనార్దన స్వామి వారిని గురించి మహాకవి శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులవారు ఈ క్రింది పద్యం వ్రాశారు.

"ఇందొక జన్మమందున ననేక జనుష్కృత కర్మబంధముల్/
డిందగ జేసికొన్న సుచరిత్రులు, కృష్ణ కథా సుధా రస/
స్యందిత హర్ష బాష్ప కలుషాయిత నేత్రులు శ్రీ జనార్దనా/
నంద సరస్వతీ ప్రధిత నాములు, స్వాములకున్ ప్రణామముల్//"

ఈ పద్యము ఎంతోఅర్థవంతమైనది.
" తరతి శోకమాత్మవిత్" (ఆత్మజ్ఞాని దుఃఖాన్ని అధిగమిస్తాడు).
ఆత్మజ్ఞానం కలగాలంటే అనేక జన్మలనుండి పేరుకుపోయిన కర్మ బంధములు నశించాలి.

జీవులు రాగ, ద్వేషములతో కూడి కర్మలు ఆచరిస్తారని, వాటి ఫలితములు అనుభవించడానికి అనేకజన్మలు ఎత్తుతారని శాస్త్రములు చెప్పుచున్నవి.
అత్యంత దుర్లభమైన మానవజన్మను వ్యర్థం చేసుకో కుండా,కర్మబంధములను నశింపజేసుకొని, మోక్షము సాధించడానికి వినియోగించాలని, ఆ శాస్త్రములు ఉద్బోధిస్తున్నవి.

కర్మబంధములను సత్కర్మానుష్ఠానము ద్వారా ముందు నశింపజెయ్యాలని వేదములు తెలియజేస్తున్నాయి.
అది దృష్టిలో పెట్టుకొని,కవి"ఇందొక జన్మమందున"మరియు " సుచరిత్రులు"అనే రెండు అర్థవంతమైన పదములు వాడారు.
సుచరిత్రులు అంటే మంచి నడవడి కలవారు అని అర్ధం.
రాగ ద్వేషములకు లోనుగాకుండా, శాస్త్రం చెప్పిన విధముగా జీవితం గడిపేవారిని"సుచరిత్రులు" అంటారు.
"అటువంటి సుచరిత్రుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా!" అని వాల్మీకి మహర్షి, నారదమహర్షిని అడిగినట్లు, రామాయణం ప్రారంభము లొనే చెప్పబడింది( చారిత్రేణచ కో యుక్త:).

శ్రీ జనార్దనస్వామి వారు కూడా శ్రీ శ్రీ శ్రీ కంచి పరమాచార్యులవారిని తమ" శంభోర్మూర్తి:"అనే గ్రంథం లో అలానే స్తుతించారు.

శ్లో// వృత్తైః స్వీయై ర్మధుర మధురై వాఙనిగుమ్భైర్జనానాం/
ధర్మే మార్గే పరమసుఖదే బోధముత్పాదయన్తీ/
ముక్త్వా మోనం వటవిటపినో మూలతో నిఃసరన్తీ/
శమ్భోర్మూర్తిః చరతి భువనే దేశి కేంద్ర స్వరూపా//

ధర్మాన్ని ఉద్ధరించాలనుకున్న పరమేశ్వరుడు మౌనాన్ని చాలించాడు. తాను కూర్చున్న వటవృక్షాన్ని విడిచి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి రూపాన్ని ధరించాడు.

దివ్యమైన తన నడవడి చేతను, మధురాతి మధురమైన తన వాక్కుల చేతను, సమస్త జీవులకు సుఖాన్ని ఇచ్చే ధర్మమార్గమునందు ప్రజలకు జ్ఞానము కలుగజేస్తూ, చంద్రశేఖరేంద్ర సరస్వతీ జగద్గురు రూపంలో ఆ పరమశివుని మూర్తి ఈ భూమి మీద సంచరించింది).

తమ వాక్కు, తమ మనస్సు, తమ నడవడి కూడా తాదృశమే కాబట్టి శ్రీ జనార్దనస్వామి వారు, శ్రీ పరమాచార్యులవారిని అలా స్తుతించగలిగారు.

ఆ విధమైన తమ నడవడితో అనేక జన్మల కర్మబంధములను నశింపజేసుకొన్న శ్రీజనార్దనస్వామి వారికి ప్రణామములు, అంటున్నారు కవీశ్వరులు.

శ్లో// జన్మ కర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః/
త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి, మామేతి సో౽ర్జున//

ఎవరు నా దివ్యమైన జన్మలను, దివ్యమైన కర్మలను, యథార్థముగా తెలుసు కుంటారో,వారు అన్ని కర్మబంధములు నశించటము వలన పునర్జన్మ లేనివారై,నన్ను పొందటము అనే మోక్షస్థితిసాధిస్తారు.

అనే భగవద్గీత శ్లోకాన్ని శ్రీ జనార్దన స్వామివారి కి అన్వయిస్తున్నారు, ఉత్పలవారు.

భగవత్ తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకుని,తాదాత్మ్యస్థితి పొందిన
వారు శ్రీ స్వామివారు.

" శ్రీకృష్ణకథ అనే అమృతాన్ని శ్రవణము ద్వారా ఆస్వాదిస్తూ ,ఆనందబాష్పములు స్రవిస్తున్న నేత్రములతో కూడిన శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి వారికి ప్రణామములు" అంటున్నారు మహాకవి ఉత్పలవారు.
(కృష్ణ కథా సుధారస స్యందిత హర్ష బాష్ప కలుషాయిత నేత్రులు).

పరమ పవిత్రమైన కుప్పావారి వంశంలో 3-11-1909 వ తేదీ, సౌమ్య నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ సప్తమి, బుధవారం నాడు బ్రహ్మశ్రీ కుప్పా దక్షిణామూర్తి, శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతులకు శ్రీ స్వామివారు జన్మించారు.
జన్మస్థలం చివలూరు గ్రామం (తెనాలి తాలూకా).

"శ్రీ కుప్పా లక్ష్మావధాని" అనేపూర్వాశ్రమ నామధేయులైన వీరు వేద,వేదాంగములలోను, ఆయుర్వేదము లోను,సాంఖ్య, యోగాది సమస్త శాస్త్రములలోను నిష్ణాతులు.

"సాంగ స్వాధ్యాయ భాస్కర" బిరుదాంకితులు.
కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి లాంటి ఉద్దండ కవి పండితులనేకులకు వేదాంతశాస్త్రాన్ని బోధించారు.

1981 వ సంవత్సరములో పరమాచార్యులవారు,తాము అప్పుడు బసచేస్తున్న,మహారాష్ట్రలోని,ఛత్రపతి శివాజీ మహారాజు జన్మస్థలమైన, "సతారా" అనే గ్రామానికి స్వయముగా శ్రీ అవధానిగారిని,పిలిపించారు.
పీఠాధిపతులు తమ ఉత్తరాధికారికి తప్ప ఇతరులకు సన్యాసదీక్ష ఇవ్వగూడదనే సత్సాంప్రదాయాన్ని పురస్కరించుకొని,
తమ సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ నారాయణానన్ద సరస్వతీ స్వామివారి ద్వారా, శ్రీ అవధానిగారికి 16-5-1981తేదీ,దుర్మతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు సన్యాసాశ్రమమును ఇప్పించారు.
వారి దీక్షా నామము శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి వారు.
అప్పటికి వారి వయస్సు డెబ్బది రెండు సంవత్సరములు.
వారు దేశమంతా అనేక పాదయాత్రలు చేశారు.
కంచి నుండి కాశీపట్టణానికి కాలినడకన వెళ్ళారు.
2000 వ సంవత్సరంలో,ఉత్తరాంధ్ర వేద సభను స్థాపించారు.
2002 వ సంవత్సరంలో "తెలంగాణా వేద విద్వత్సభ" నుస్థాపించారు.(వారు సిద్ధి చెందే కొన్ని రోజులముందు)
రాయలసీమ వేదవిద్వత్సభ ఏర్పాటుకు, శిష్యులకు మార్గ నిర్దేశం చేశారు.
ఆ సభ 2003 సంవత్సరంలో ఏర్పడింది.
అనేక వేదాంత ప్రకరణ గ్రంధాలు రచించారు.
శ్రీ కంచి పరమాచార్యుల వారిని గురించి ఎవరికీ అంతుబట్టని అనేక విషయాలను ప్రస్తావిస్తూ "శంభోర్మూర్తిః" అనే గ్రంధాన్ని సంస్కృతంలో వ్రాసారు.
ఆ గ్రంధాన్ని మహా మహోపాధ్యాయ,పద్మశ్రీ
కీ. శే., శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెలుగులోకి అనువదించారు.


శ్రీ శైలం లో 14-5-2002 తేదీ, చిత్రభాను నామ సంవత్సర, వైశాఖ శుద్ధ తదియ, "అక్షయ తృతీయ" నాడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్వామివారు సమాధి స్థితిలోకి వెళ్లారు.
ఒక శిష్యుడు వారి చెవి దగ్గర "శివోహం" అని గట్టిగా పలికినారు.
స్వామివారు కళ్ళు తెరవకుండానే "శివోహం" అన్నారు.
అంతే.
జీవన్ముక్తులైన స్వామి వారు విదేహ ముక్తులైనారు.

శ్రీ స్వామివారి జన్మదినం సందర్భంగా వారికి భక్తిపూర్వకముగా ప్రణామములు సమర్పించి వారి అనుగ్రహపాత్రులమవుదాము.

శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,

0
3229 views