మరో చరిత్రను సృష్టించిన మరో చరిత్ర
సినిమా .
మరో చరిత్రను సృష్టించిన మరో చరిత్ర సినిమా . వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వందల రోజులు ఆడే రోజుల్లో ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా వందల రోజులు ఆడటమంటే మరో చరిత్ర కాక మరేమిటి ! చరిత్రలో అప్పటివరకు లైలా మజ్ను , సలీం అనార్కలి , రోమియో జూలియట్ కధలే విషాద ప్రేమ గాధలు . ఉదాహరిస్తే ఎన్నో గాధలు హృదయ విదార విషాద గాధలు . అలాంటి ప్రేమ గాధల్లోకి చేరింది బాలు-స్వప్నల మరో విషాద ప్రేమ చరిత్ర .
బాాలచందర్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సినిమాను విషాదం చేయటానికి . విషాదం చేసి ఉండకపోతే ఇలాంటి మరో చరిత్ర సృష్టించి ఉండేది కాదేమో ! రంగుల సినిమాలు తెలుగు సినిమా రంగాన్ని ఆక్రమించుకుంటున్న సమయంలో బ్లాక్ & వైట్ సినిమా తీయటం , ఆ సినిమా మరో చరిత్రను సృష్టించటం మరో చరిత్రే నిస్సందేహంగా .
ఓ తమిళబ్బాయి , ఓ తెలుగమ్మాయి . ఇద్దరూ ఆ వయసులో సహజంగా ఉండే ధైర్యం ఉన్నోళ్ళే , మించి మొండోళ్ళు . ప్రేమంటేనే మొండితనం . అరవై ఏళ్ల వయసులో కొత్తగా ప్రేమించుకున్నా మొండిగానే ఉంటుంది ప్రేమ . అలాంటి ఇద్దరు యువతీయువకులు ప్రేమలో పడటాన్ని , వాళ్ళు ప్రేమించుకోవటాన్ని నలుపు తెలుపుల్లో , విశాఖ-భీమిలి-అరకు అందాల నేపధ్యంలో బాలచందర్ అద్భుతంగా ఆవిష్కరించారు .
యం యస్ విశ్వనాధన్ సంగీత దర్శకత్వంలో పాటలు 46 ఏళ్ల తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్టే . ఏ తీగె పువ్వును పాట సుశీలమ్మ పాడిందంటే ఆశ్చర్యమే . మధ్యమధ్యలో కమలహాసన్ అరవ పదాలు గమ్మత్తుగా ఉంటాయి . పదహారేళ్ళకు నీలో నాలో , భలె భలే మొగాడివోయ్ బంగారు నాసామివోయ్ పాటల్ని బాల సుబ్రమణ్యం , యల్ ఆర్ ఈశ్వరి , జానకిలు ఇరగతీసేసారు . బాలసుబ్రమణ్యం ఇంగ్లీషులో ఎత్తుకోవడం వెరైటీగా ఉంటుంది . ఈ పాటలో కమలహాసన్ , సరిత డాన్స్ కూడా భలేగా చేస్తారు .
లిఫ్టులో పాడే పాట చాలా ఇంటరెస్టింగ్ . సినిమా పేర్లన్నీ కూర్చి ఆత్రేయ బాగా వ్రాసారు . లిఫ్టే అప్పటికి ఇంకా పాపులర్ కాలేదు . అలాంటి లిఫ్టులో పాట కుర్రకారుకి మాంచి ఐడియా ఇచ్చేసారు . కుర్రకారు ఆ ఐడియాను బాగానే అందుకున్నారు కూడా .
వాణీ జయరాం పాడే విధిచేయు వింతలను పాట హృద్యంగా ఉంటుంది . ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మరొకటి కూడా ఉంది . కమల్ హాసన్ శాస్త్రీయ నృత్యం . సాగరసంగమం సినిమా కన్నా ముందే ఈ సినిమాలో తన శాస్త్రీయ నృత్య పటిమను ప్రదర్శించారు . ఈ సినిమాలో పాటలను అన్నీ ఆత్రేయే వ్రాసారు . అద్భుతంగా వ్రాసారు .
ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర సంధ్య . ఊరుమ్మడి బతుకులు సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న మాధవికి ఈ పాత్ర రావటం , ఆమె చాలా బాగా నటించటం వలన ఆమెకు తర్వాత కాలంలో మంచి అవకాశాలను తెచ్చిపెట్టాయి .
గణేష్ పాత్రో వ్రాసిన డైలాగులు ఈ సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి . డొంక తిరుగుడు లేని straight dialogues . సినిమాలో పాత్రలన్నీ డొంక తిరుగుడు లేకుండా straight గా , మొండిగా , మూర్ఖంగా ఉంటాయి . హీరోహీరోయిన్ల తల్లిదండ్రులు , సంధ్య అన్న , హీరోయిన్ని ప్రేమించే పట్టాభి , మానభంగం చేసే విలన్ అందరూ మొండిగా , మూర్ఖంగానే ఉంటారు . ఒక్క మాధవి నటించిన సంధ్య పాత్రే సున్నితంగా ఉండేది .
161 మందిని ఆడిషన్ చేసాక అభిలాష అనే అమ్మాయి హీరోయినుగా ఎంపిక అయింది . ఆమే కొత్త నటి సరిత . హీరోయిన్ అంటే సన్నగా , నాజూగ్గా , ఎర్రగా , తెల్లగా ఉండాలనే ఫిక్సేషన్ని వదిలి , next door అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి అమ్మాయి సరితను ఎంపిక చేసుకున్నారు బాలచందర్ . ఆయన ఎంపిక కరెక్ట్ అయింది . మొట్టమొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ లాగా నటించింది .
ఓ తమిళ నటుడు , ఓ అరవ దర్శకుడు తెలుగులో తీసిన ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తే అక్కడా హిట్టయింది . కమల్ హాసన్ జోడీగా రతి అగ్నిహోత్రి నటించింది . బాలసుబ్రమణ్యం పాడిన తేరె మేరె బీచ్ మే పాట సూపర్ డూపర్ హిట్టయింది . కన్నడం , మళయాళం , తమిళం భాషల్లో తీయబడింది .
ఈ సినిమాలో ఎర్ర హీరో మాదల రంగారావు ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు . ఇతర పాత్రల్లో రమణమూర్తి , మిశ్రో , జయవిజయ , పి యల్ నారాయణ , కాకినాడ శ్యామల , తదితరులు నటించారు . ఈ సినిమాలో సంధ్య అన్నగా నటించిన నటుడు పేరు నాకు తెలియదు . బాగా నటించాడు . అతని girl friend గా నటించిన నటి పేరు గుర్తుకు రావటం లేదు . ఇరగతీసింది .
ఈ తరంలో కూడా ఈ సినిమాను చూడని వారు ఎవరూ ఉండరు . ఒక్కొక్కరు పది సార్లయినా చూసి ఉంటారు . పోయిన వారం కూడా ఏదో చానల్లో వచ్చింది . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి .