భూములు మింగేస్తున్న
బడా భూ.స్వామి, కోఆప్షన్, వ్యాపారవేత్త
ఆక్రమించుకున్నట్లు ప్రజల ఆరోపణలు
వక్ఫ్ భూములపై పె(గ)ద్దల కన్ను
కామారెడ్డి బిచ్కుంద సెప్టెంబర్
వక్ఫ్ బోర్డు భూములను అమ్మినా కొనుగోలు చేసినా చట్టారిత్య నేరమే. ఈ భూములు అనుభవించడానికి తప్పితే అమ్మడానికి వీల్లేని ఈ భూముల లావాదేవీలు భారీగా జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది. మండల వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు వందల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయి. వక్ఫ్ బోర్డు భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో కనపడకపోవడంతో ఎంతో విలువైన భూములను కొంతమంది ఆక్రమించేస్తున్నారు. రాజకీయ బలం, అధికారుల వత్తాసుతో కబ్జాదారులు ఈ భూములను విక్రయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో దర్గా, మసీదు, ఈద్గా, అశుర్ ఖానా, ఖజాయత్, ఖబరస్తాన్ భూములు ఉన్నాయి. వక్ఫ్ చట్టం 1951 అమల్లోకి రావడంతో బోర్డు పరిధిలోని భూములను 1953లో ఖాస్రా పహనీలో అప్పట్లో నమోదు చేశారు. రికార్డుల్లో నమోదైనప్పటికీ కొంతమంది ఆ భూములను విక్రయించుకున్నారు. గతంలో అధికారం అడ్డం పెట్టుకొని తాజా మాజీ కొఆప్షన్ వక్ఫ్ బోర్డు ఆస్తులకు తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని శాంతాపూర్ గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు ఆరోపించారు. కాగా మండలకేంద్రంలో సైతం ఓ బడా భూ.స్వామీ మరియు ఓ బడా వ్యాపారవేత్త వక్ఫ్ బోర్డు భూములను రిజర్వేషన్లు చేసుకొని పట్టా పాస్ బుక్ తో రైతు బంధును కూడా పొందుతున్నట్లు కీలక సమాచారం. ఓ బడా స్వామి అయితే దేవాదాయ శాఖ భూములు కూడా అమ్ముకుంటున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.