logo

ఉర్రూతలూగించిన "స్వర బృందావనం" ద్వితీయ సంగీత విభావరి. - తూములూరి శ్రీ కుమార్

స్వర బృందావనం సంస్థ యొక్క రెండవ సంగీత విభావరి ప్రేక్షకుల హృదయాలను విశేషంగా ఆకట్టుకోవడమే కాక గాయనీ గాయకులు కురిపించిన స్వరాల జల్లులకి పాటల వర్షానికి శ్రోతలూ, ప్రేక్షకులూ తడిసి ముద్దయ్యారు. సినిమా ప్లేబ్యాక్ సింగర్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతమైన గానామృతాన్ని ప్రదర్శించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు స్వర బృందావనం యొక్క గాయనీ గాయకులు.


సంస్థ వ్యవస్థాపకులు బృందావనం రవికాంత్ మరియు సహ నిర్వాహకులు తూములూరి శ్రీ కుమార్ ఆద్వర్యంలో హైదరాబాద్ లోని కళా భారతి సిటీ కల్చరల్ హాల్ లో 30 ఆగస్టు న జరిగిన ద్వితీయ సంగీత విభావరి కార్యక్రమంలో గాయకులు శరత్ కృష్ణ, రాంబాబు, మల్లికార్జున్, మహేంద్ర, తూములూరి శ్రీ కుమార్, శ్రీ బృందావనం రవికాంత్ అలాగే గాయనీమణులు డా. దాము రాజేశ్వరి, పసుమర్తి సీతా, సమీరా, సాలెం శ్రీదేవి, సీతా కుమారి పల్గొన్నారు.
సీతా కుమారి మరియు శరత్ కృష్ణ పాడిన "తేరే బినా జిందగీ కి కోయి" ; పసుమర్తి సీతా మరియు మల్లికార్జున్ విజిల్ వేస్తూ పాడిన "నీలికన్నుల నీడలలోనా" ; డా. దాము రాజేశ్వరి, రాంబాబు తో ఆలపించిన "కనుపాప కరవైన కనులెందుకో" అలాగే రవికాంత్ తో ఆలపించిన "పచ్చ బొట్టేసిన పిల్లగాడ నీతో" ; సేలం శ్రీదేవి మరియు శ్రీ కుమార్ పాడిన "అభివందనం యమ రజాగ్రణి" ; సమీరా మరియు మల్లికార్జున్ ఆలపించిన "వాడుక మరచెదవేలా" ; సీతా కుమారి మరియు రవికాంత్ పాడిన "అందం హిందోళం" ; మహేంద్ర ఆలపించిన "ఎదుట నిలిచింది చూడు" అన్న పాటలు ప్రత్యెక ఆకర్షణగా నిలిచాయి.


ఆత్మబంధువుగా పేరుపొందిన ప్రముఖ వ్యాఖ్యాత శరత్ కృష్ణ గారు ఈ కార్యక్రమానిపై తమ భావాన్ని వ్యక్తపరుస్తూ, "స్వర బృందావనం చేపట్టిన ఈ ద్వితీయ విభావరి అద్వితీయంగా సుసంపన్నం చేసిన సూత్రధారులు "రవిశ్రీ" మిత్రద్వయానికి శుభాభినందనలు. మీ ఇరువురి మాటలూ, పాటలూ, చేతలూ సౌమ్యంగా అందరినీ ఆకట్టుకున్నాయి, ఆకట్టుకుంటూనే వుంటాయని నమ్మేవారిలో నేనూ ఒకడిని. గాయనీమణులు మా ఆడపడుచులు అందరూ (సీతమ్మ తల్లి, సీతాకుమారి గారు, డాక్టర్ దాము రాజేశ్వరి గారు, నా చెల్లెలు సమీర, మరో చెల్లి శ్రీదేవి) చాలా బాగా పాడారు. ముందు ముందు మీతో మరిన్ని మధుర గీతాలను పాడే అవకాశం దక్కుతుందని కొండంత ఆశ నాది. సోదర సములైన గాయకులు (బావగారు రాంబాబు గారు, మల్లికార్జున రావు గారు, రవికాంతుడూ, శ్రీకుమారుడూ) అందరూ ఒకరిని మించి మరొకరన్న చందాన అలరించిన మీ ఆత్మీయతకు సవినయంగా జోతలు. చిరంజీవి దాము మహేందర్ చాలా మృదువైన గాత్రంతో పాటలు పాడిన తీరుకు చాలా ఆనందం కలిగింది. ఈ చిరంజీవి భవిష్యత్తులో మరింత ఎదిగి అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను." అంటూ కార్యక్రమంపై ప్రశంసలజల్లులు కురిపించారు.


సంస్థ వ్యవస్థాపకులు బృందావనం రవికాంత్ మాట్లాడుతూ స్వర బృందావనంకి ప్రత్యేకించి ముఖ్య అతిథులు ఉండరు, కార్యక్రమంలో పాల్గొన్న గాయనీగాయకులే ముఖ్య అతిథులు అని పేర్కొన్నారు. అనంతరం గాయనీగాయకులందరికనీ వారు శాలువాలతో సత్కరించి కార్యక్రమాన్ని విజయవతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

-తూములూరి శ్రీ కుమార్

130
11512 views