logo

అజ్ఞానంవల్ల ప్రజలు ధర్మాచరణకు దూరమై, అనేక పాపకర్మలను చేస్తున్నారు. -తూములూరి మధుసూదనరావు

"ధర్మం వల్ల అన్ని పురుషార్థములు సిద్ధిస్తాయి. ఈ విషయం తెలియని ప్రజలు, వేదోక్తమైన ధర్మాన్ని ఆచరించక కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు" - (వేదవ్యాసమహర్షి)

అజ్ఞానంవల్ల ప్రజలు ధర్మాచరణకు దూరమై, అనేక పాపకర్మలను చేస్తున్నారు. మనం చేసే ఈ పాపకర్మలకు కారణం మనలోని కామము, క్రోధము, లోభము మొదలైన చెడు గుణాలు. హింస చెయ్యడము, అసత్యం చెప్పడము, ఇతరుల యొక్క స్త్రీలను అనుభవించడము, ఇతరుల సంపదను దోచుకోవడము, మొదలైనవి ఆ పాపకర్మలు. వీటి ఫలితాలు, జీవుడు అంతులేని దుఃఖమును అనుభవించడము, ఎల్లప్పుడు అజ్ఞానములో ఉండిపోవడము.

ఇవి
(1) మనం స్వయంగా చేసేవి,
(2) ఇతరులచేత చేయించేవి,
(3)ఇతరులు చేస్తే మనం ఆమోదించేవి,
అని మూడు విధములుగా వుంటాయి.

పాపకర్మలను చేసినవాడు,చేయించినవాడు, ఆమోదించిన వాడు, అందరూ సమంగా ఈ దుఃఖములను అనుభవిస్తారని, ఎప్పటికీ అజ్ఞానములోనే ఉండిపోతారని, శాస్త్రాలు చెబుతున్నాయి.

యోగ సూత్రం.
"హింసాదయః,కృత,కారితానుమోదితాః/
లోభ,క్రోధ,మోహ పూర్వకాః/
మృదు,మధ్యాధిమాత్రాః,/
దుఃఖ,అజ్ఞాన, అనంత ఫలాః //"
(శ్రీ పతంజలి మహర్షి).

ప్రజలలోను, పాలకులలోను, పాపభీతి లేకపోవడం వలన, ధర్మాచరణ తగ్గిపోవటంవలన, ఇప్పుడు ప్రజలంతా అశాంతితో వుంటున్నారు. ఏ ఒక్కరికీ శాంతి లేదు. దేశములో హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, భూకబ్జాలు, మోసాలు, విద్యా, వైద్యరంగాలలో విపరీతమైన దోపిడీ, ప్రజావసరాలను ప్రభుత్వాలు గాలికి వదిలేయడము, అన్ని పదార్ధాలలో కల్తీ, అధికార దుర్వినియోగము, మొదలైన వాటితో ప్రజలు అనేక విధాలుగా కష్టాలు పడుతున్నారు.

వేదవ్యాస మహర్షి ఈ విధంగా అంటున్నారు:

శ్లో// ఊర్ధ్వబాహుర్విరోమ్యేష: నహి కశ్చిత్ శ్రుణోతి మే/
ధర్మాదర్ధశ్చ కామశ్చ స కిమర్ధం న సేవ్యతే //

నేను రెండు చేతులు పైకిఎత్తి, మీ అజ్ఞానానికి దుఃఖిస్తూ, గొంతు చించుకొని బిగ్గరగా అరుస్తున్నాను. ఒక్కడూ నా మాట వినిపించుకోవడం లేదు. ధర్మమువల్లనే మీకు ఐశ్వర్యము లభిస్తుంది. ధర్మమే మీ సమస్త మైన కోరికలను తీరుస్తుంది. అటువంటి ధర్మాన్ని మీరు ఎందుకు ఆచరించడం లేదు?.

ధర్మం వల్ల అన్ని పురుషార్థములు సిద్ధిస్తాయి. ఈ విషయం తెలియని ప్రజలు, వేదోక్తమైన ధర్మాన్ని ఆచరించక కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు, అంటున్నారు వేదవ్యాసమహర్షి.

ధర్మ మార్గంలో ప్రజలను నడిపి,అందరూ సుఖంగా ఉండేటట్లుచేయడమే,వేదము, వేదంలో చెప్పిన ధర్మములను బోధించే రామాయణ, భారత, భాగవతాది, ఆర్ష గ్రంథముల యొక్క లక్ష్యం. సాక్షాత్తు భగవంతుడు ప్రతి యుగములోను అవతరించడం కూడా ధర్మసంస్థాపన కోసమే.
(ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే, యుగే - శ్రీకృష్ణుడు)

మానవజాతిని ఉద్ధరించేందుకు, సమస్త జగత్తు సుఖ శాంతులతో వుండేటందుకు మహర్షులు చేసిన ఈ వేదోక్త ధర్మబోధను అర్ధం చేసుకుని, ప్రజలు, పాలకులు, యథా శక్తి ఆచరణలో పెట్టగలరని ఆశిద్దాం.

శ్రీ సీతారామాభ్యాం నమః .సర్వే జనాః సుఖినో భవన్తు.

తూములూరి మధుసూదనరావు tumulurisri2010@gmail.com

110
14158 views