logo

రోహిణీ నక్షత్రముతో కూడిన, శ్రావణ కృష్ణ అష్టమి నాడు రాత్రి చంద్రోదయ సమయంలో బాలకృష్ణుడు సముద్భవించాడు. -తూములూరి మధుసూదనరావు


శ్లో// కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్/
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్//

శ్లో//వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్/
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్//

శ్లో// కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే/
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే//
-------------------

ఈ రోజు (26-8-'24) శ్రీకృష్ణ జన్మాష్టమి.
పరమపవిత్రమైన పర్వదినం.

శ్లో//శ్రావణ్యాం కృష్ణ పక్షేతు, అష్టమీ రోహిణీ యుతా/తస్యాం చంద్రోదయే రాత్రౌ బాలకృష్ణ సముద్భవః//

రోహిణీ నక్షత్రముతో కూడిన, శ్రావణ కృష్ణ అష్టమి నాడు రాత్రి చంద్రోదయ సమయంలో బాలకృష్ణుడు సముద్భవించాడు.

తిథి, నక్షత్రములు ఒకే రోజు సందర్భపడనప్పుడు కొంతమంది తిథికి, కొంతమంది నక్షత్రానికి ప్రాముఖ్యతనిస్తూ వారి, వారి, సంప్రదాయముల ప్రకారం ఈ పూజ నిర్వర్తిస్తున్నారు.

ఉత్తరాయణంలో, మాఘ బహుళ చతుర్దశి ,మహా శివరాత్రి పర్వదినం నాడు,అర్థరాత్రి
నిర్గుణ పరబ్రహ్మ " శివలింగం" స్వరూపంలో ఆవిర్భవించాడు.
దానికి సరిగ్గా నూట ఎనభై దినములకు,శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి ఆ నిర్గుణ పరబ్రహ్మే సంపూర్ణ సగుణబ్రహ్మగా శ్రీ కృష్ణావతారం దాల్చాడు.

ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఉపవాస, జాగరణాది, నియమాలతో ఈ రెండు రోజులు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించి తరిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ

బ్రహ్మాండపురాణములో,జన్మాష్టమి నాడు చేయవలసిన శ్రీకృష్ణ పూజా విధానం ఈవిధంగా చెప్పబడింది.

ఈ రోజున నిత్యకృత్యములు యధావిధిగా నిర్వర్తించి, ఉపవసించి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజించాలి.

సంక్షేపముగా పూజా విధానం.
కేశవాది నామములతో ముందు ఆచమనం,దీపారాధన, చేసి, సంకల్పం చెప్పుకుని, ధ్యాన, ఆవాహనాది షోడశోపచార పూజ ఈ క్రింద చెప్పిన విధంగా చేయాలి.

ధ్యానం.
1.శ్లో//ధ్యాయామి బాలకం కృష్ణం, మాత్రంకే స్తన్య పాయినమ్/
శ్రీవత్స వక్షసం కాంతం నీలోత్పల దళచ్ఛవిమ్//

దేవకీ, వసుదేవ, యశోదా, నందగోప, బలభద్రాది సహితం శ్రీకృష్ణం ధ్యాయామి.
ధ్యానం సమర్పయామి.

ఆవాహనం.
2.ఆవాహయామి దేవేశం, శ్రీపతిమ్ శ్రీధరం హరిమ్/
బాలరూప ధరం విష్ణుం సచ్చిదానంద విగ్రహమ్//

శ్రీ కృష్ణం ఆవాహయామి.

ఆసనం.
3.శ్లో//దామోదర నమస్తేస్తు దేవకీ గర్భ సంభవ/
రత్న సింహాసనం చారు గృహ్యతాం గోకుల ప్రియ//

దివ్య రత్నఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి.

పాద్యం.
4.శ్లో// పు‌ష్పాక్షత సమాయుక్తంపురుషోత్తమ పూర్వజ/
పాద్యం గృహాన దేవేశ పూర్ణరూప నమోస్తుతే//

పాదయోః పాద్యం సమర్పయామి.

ఆర్ఘ్యం.
5.గంధ పుష్పాక్షతో పేతం ఫలేనచ సమన్వితం/
అర్ఘ్యం గృహాణ భగవన్ వాసుదేవ ప్రియాత్మజ//

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనం.
6.శ్లో//నానా నదీ సమానీతం సువర్ణ కలశ స్థితం
గృహాణాచమనార్థాయ విమలం జలమచ్యుత//

ముఖే ఆచమనీయం ‌సమర్పయామి.

మధుపర్కము.
7. శ్లో//మధు, దధ్యాజ్య సంయుక్తం మహనీయ గుణార్ణవ/
మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణమే//

మధుపర్కం సమర్పయామి( తేనె, పెరుగు, నేయి).

పంచామృత స్నానం
8.శ్లో// పంచామృతం గృహాణేశ పయో,దధి,ఘృతం, మధు/
శర్కరామపి గోవింద శకటాసుర భంజన//

పంచామృత స్నానం సమర్పయామి.(పాలు, పెరుగు,నేయి,తేనె,చక్కెర).

శుద్ధోదక స్నానం
9.శ్లో//గంగా,గోదావరీ,కృష్ణా, యమునాభ్య స్సమాహృతం/
సలిలం విమలం దేవ స్నానార్ధం ప్రతిగృహ్యతాం//

శుద్ధోదక స్నానం సమర్పయామి.

వస్త్రం.
10.శ్లో// పీతాంబర యుగం దేవ గృహాణ సుమనోహరం/
దేహి మే సకలా నర్ధాన్ దేవకీ ప్రియనందన//

దివ్య వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం
11.శ్లో//ఉపవీతం గృహానేదం కాంచనం కమలాపతే/
పవిత్రం పాహిమాం దేవ నమః పరమ పూరుష//

యజ్ఞోపవీతం సమర్పయామి.

ఆభరణం.
12.శ్లో//హార,నూపుర,కేయూర, కింకిణీ దామ పూర్వకం/
గృహాణా‌భరణం సర్వం శరణాగత వత్సల//

కిరీటాది సకలాభరణాని సమర్పయామి.

గంధం.
13.శ్లో//గంధం కుంకుమ కస్తూరీ ఘనసార సమన్వితం/
గృహాణ తే నమో దేవ కుబ్జానుగ్రహ కారిణే//

శ్రీగంధం సమర్పయామి.

అక్షతలు.
14.శ్లో// అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ ముక్తాఫల సమప్రభాన్/
వాసుదేవ గృహాణత్వం నమస్తే భక్తవత్సల//

అక్షతాన్ సమర్పయామి.

పుష్పం
15.శ్లో//జాజీ, చంపక, పున్నాగ,కేతకీ, మల్లికాదిభి:/
కుసుమై: పూజయామి త్వాం సుదామ పరి పూజిత//

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.

అంగ పూజ.
అనఘాయ నమః పాదౌ పూజయామి.
గోపాలాయ నమః గుల్ఫే పూజయామి.
జన్మ రహితాయ నమః జానునీ పూజయామి.
పూతనా వైరినే నమః ఊరూ పూజయామి
శకటాసుర భంజనాయ నమః కటిం పూజయామి
నవనీత ప్రియాయ నమః నాభిమ్ పూజయామి.
ఉత్తాల తాళ భేత్రే నమః ఉదరం పూజయామి.
వనమాలినే నమః. వక్షస్థలం పూజయామి.
చతుర్భుజాయ నమః. హస్తాన్ పూజయామి.
కంసారయే నమః. కంఠం పూజయామి
మధురా నాధాయ నమః. ముఖం పూజయామి.
కుచేల సంపత్ప్రదాయ నమః కపోలే,(బుగ్గలు) పూజయామి.
కంజలోచనాయ నమః నేత్రే పూజయామి.
కరుణానిధయే నమః కర్ణౌ పూజయామి.
లలితాకృతయే నమః లలాటం పూజయామి.
శుక సంస్తుతాయ నమః శిరః పూజయామి.
అనఘాయ నమః అలకాన్ (ముంగురులు) పూజయామి.
సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి.

దీని తరువాత అష్టోత్తర శతనామావళి తో పూజ చెయ్యాలి.

ఆ తరువాత,
ధూపం.
16.శ్లో//ధూపం గృహాణ వరద దశాంగేన సువా‌సితం/
గరుడ ధ్వజ గోవింద గోవర్ధన ధరా౽వ్యయా//
ధూపమాఘ్రాపయామి.

దీపం.
17.శ్లో//‌సాజ్యం త్రివర్తి సంయుక్తం బర్హినాయోజితం మయా/
దీపం గృహాణ దేవేశ దానవారే నమోస్తుతే//
దీపం దర్శయామి.

నైవేద్యం.
18.శుద్ధ మన్నం పాయసం చ కృసరాపూప సంయుతం/
సితాన్నం సద్ఘృతంచైవ గృహాణ గరుడ ధ్వజ//
నైవేద్యం సమర్పయామి.
శ్రీకృష్ణునకు వెన్న, పాలు, మీగడ, చాలా ఇష్టం కాబట్టి అవికూడా నైవేద్యం పెట్టాలి.

తాంబూలం.
19. శ్లో//పూగీ ఫలం సకర్పూరం నాగవల్లీ దళానిచ/
చూర్ణంచ సంగృహానేదం సర్వదేవ సమాదృతా//
తాంబూలం సమర్పయామి.

నీరాజనం.
20.నీరాజనం గృహానేదం నారాయణ నిరామయా/
నీరజాక్ష నమస్తుభ్యం నతాఖిల ఫలప్రదా//
ఆనంద, మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి.
సంతత శ్రీరస్తు. సమస్త మంగళాని భవంతు.
నిత్య శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు.

మంత్రపుష్పం.
21శ్లో//పుష్పాంజలిం గృహాణత్వం మయా భక్త్యా సమర్పితం/
పురుషోత్తమ పూతాత్మన్ పుణ్యమూర్తే పరాత్పరా//
పాదారవిందయో: దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణం.
22.శ్లో//ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే/
ప్రదక్షిణం కరోమిత్వాం ప్రసీద పురుషోత్తమ//
ఆత్మప్రదక్షిణ నమస్కారాణి ‌సమర్పయామి.

నమస్కారం.
23.శ్లో// నమస్తుభ్యం జగన్నాధ దేవకీ తనయ ప్రభో/
వసుదేవసుతా ౽నంత యశోదానంద వర్ధనా//
24.శ్లో//గోవింద, గోకులాధార గోపీకాంత గుణార్ణవ/
పాహిమాం పద్మ నయన పతితం భవసాగరమ్//
నమస్కారాణి సమర్పయామి.

ప్రార్ధన.
25.శ్లో// దేవ దేవ దయాసింధో
దేహిమే వరమీప్సితం/
త్వయి భక్తిం పరాం దేహి పుత్ర పౌత్రాంశ్చ సంపదః//
అని ప్రార్థన చెయ్యాలి.

శ్రీకృష్ణాష్టకం.

శ్లో//వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్/
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో//అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్/
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో//మందార గంధ సంయుక్తం,చారు హాసం చతుర్భుజమ్/
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో// ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం,నీలజీమూత సన్నిభమ్/
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో// రుక్మిణీ కేళి సంయుక్తం, పీతాంబర సుశోభితమ్/
ఆవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో// గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసమ్/
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో// శ్రీవత్సాంకం,మహోరస్కం,వనమాలా విరాజితమ్/
శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్//
శ్లో// కృష్ణాష్టకమిదం పుణ్యం,ప్రాతరుద్థాయ యః పఠేత్/
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి//

ఈ పూజ అయిన తరువాత, పూజామండపములో, ముగ్గుతో చంద్రుని వేసి, తిరిగి సంకల్పం చెప్పుకొని, చంద్ర దేవాయ నమః, ధ్యాయామి, ఆవాహయామి అంటూ చంద్రునకు షోడశోపచార పూజ చెయ్యవలెను.
చంద్రోదయ సమయమున బయటకు వచ్చి,ఫల,పుష్ప,చందన యుతమగు జలమును శంఖముచే గొని

శ్లో// క్షీరోదార్ణవ సంభూత హ్యత్రినేత్ర సముద్భవ/
గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణ్యా సహితశ్శశిన్//
శ్లో//జ్యోత్స్నాపతే నమస్తుభ్యం నమస్తే జ్యోతిషాంపతే/
నమస్తే రోహిణీకాంత సుధాకర నమోస్తుతే//

చంద్రాయ నమః,యిదమర్ఘ్యం,యిద మర్ఘ్యం,యిద మర్ఘ్యం అని మూడుసార్లు చంద్రునకు అర్ఘ్యం ఇవ్వవలెను.
పిమ్మట నారికేళ జలమును శంఖముచే గొని

శ్లో// జాతః కంసవధార్థాయ భూభారోత్తారణాయ చ/
పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయచ/
కౌరవాణాం వినాశాయ వసుదేవ కులోద్భవ/
దేవకీ గర్భసంభూత,భక్తానామభయప్రద/
గృహాణార్ఘ్యం మయాదత్తం ప్రసీద పురుషోత్తమ//

దేవకీ సహితాయ శ్రీ కృష్ణాయ నమః,యిదమర్ఘ్యం,యిద మర్ఘ్యం,యిద మర్ఘ్యం అని మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వవలెను.
శ్రీ దేవకీ, వసుదేవ,యశోదా, నందగోప, రోహిణీ, బలదేవ, చండికా, సాత్యకి, ఉద్ధవ, అక్రూర, ఉగ్రసేన, గోప, గోపికా,కాళిందీ, కాళీయాదిభ్యో నమః, యిదమర్ఘ్యం, యిదమర్ఘ్యం, యిదమర్ఘ్యం, అని తిరిగి మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వవలెను.
శక్తి ఉన్నవాళ్లు, ప్రతిమా దానం, వాయన దానం,మొదలైన,ఇతర విషయములు పురోహితుని ద్వారా తెలుసుకుని, ఆచరించాలి.
బ్రహ్మాణ్డపురాణోక్త కథను కూడా చెప్పుకొని అక్షతలు శిరమున ధరించాలి.
ఆ రాత్రి భగవత్కథలుచదువుకుంటూ, జాగరణ చెయ్యాలి.
మరునాడు నిత్యకృత్యములు నిర్వహించి,పునఃపూజ చేసి, యధా శక్తి బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన భోజనము పెట్టి, దక్షిణలు ఇచ్చి, బంధు మిత్రులతో కలిసి తాను భోజనము చేయవలెను.
"ఈ విధముగా శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మాచరించిన వారికి కోటి జన్మలలో ఆచరించిన పాపములన్నీ నశించును. ఈ జన్మలో పుత్ర పౌత్ర, ధన ధాన్యాది సమస్త సంపదలు పొంది, సర్వ భోగములు అనుభవించి చివరకు పురుషోత్తముని పదమును పొందుతారు"
అని బ్రహ్మాండ పురాణములో చెప్పబడింది.
పైన చెప్పిన విధంగా యథావిధిగా పూజ చేయలేకపోయినా, భక్తితో ఏ కొంచెం చేసినా సత్ఫలితములను పొందవచ్చు.

ర్వే జనా సుఖినోభవంతు.

తూములూరి మధుసూదనరావు tumulurisri2010@gmail.com

41
4480 views