logo

ప్రయివేట్ వారికి ఐఏఎస్ సీట్లు

*ప్రైవేటు వారికి ఐఎఎస్‌లు*

*లేటరల్‌ ఎంట్రీ పేరుతో ఆరెస్సెస్‌ మనుషులతో నింపే పనిలో ఉంది.*

*నో రిజర్వేషన్*

Aug 19,2024

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రస్తుతం దేశంలో పెద్దయెత్తున ఖాళీగా ఉన్న సివిల్‌ సర్వీస్‌ పోస్టులను మోడీ సర్కారు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పక్కన పెట్టి లేటరల్‌ ఎంట్రీ పేరుతో ఆరెస్సెస్‌ మనుషులతో నింపే పనిలో ఉంది. దీనిపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దొడ్డి దారి నియామకాలను తక్షణమే ఆపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 24 కేంద్ర మంత్రిత్వ శాఖలలోని జాయింట్‌ సెక్రెటరీ, డైరెక్టర్‌, డిప్యూటీ సెక్రెటరీ వంటి 45 పోస్టులకు ‘లేటరల్‌ ఎంట్రీ’ ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టింది. యుపిఎస్‌సి పరీక్ష ద్వారా ఐఎఎస్‌లు అయినవారు కాకుండా.. సంబంధిత విభాగాల్లో ఉన్న నైపుణ్యం, అనుభవం ఆధారంగా బయటి వ్యక్తులతో ఈ పోస్టులను భర్తీ చేయడాన్నే లేటరల్‌ ఎంట్రీ అంటారు. . అంటే, కేంద్ర ప్రభుత్వంలోని విభాగాల్లో ఉన్నతస్థాయి పోస్టుల్లో రిజర్వేషన్లను పూర్తిగా గాలికొదిలేసి తమకు నచ్చిన వ్యక్తులను నియమించుకుంటారు. పాలనా యంత్రాంగం, ఆర్మీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ పరంగా కీలకమైన సంస్థల్లో ఆరెస్సెస్‌ మనుషులను ఇప్పటికే చొప్పించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఇప్పుడు సొంతంగా మెజార్టీ లేకున్నా అవే పద్ధతులను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.

2018లో లేటరల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రారంభించిన తరువాత ఇంత పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులతో భర్తీకి పూనుకోవడం ఇదే మొదటిసారి. యుపిఎస్‌సి జాయింట్‌ సెక్రెటరీల స్థాయిలో 10, డిప్యూటీ సెక్రెటరీ, డైరెక్టర్ల స్థాయిలో 35 పోస్టులను ఈ బ్యాక్‌డోర్‌ పద్ధతిలో భరీ చేస్తోంది. జూన్‌లో ఒక వార్తా సంస్థ నివేదించినదాని ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలో ఐఎఎస్‌ అధికారుల కొరతను ఎదుర్కోవటానికి పెద్ద సంఖ్యలో లేటరల్‌ ఎంట్రెంట్స్‌ అవసరమున్నదని సిబ్బంది, శిక్షణశాఖ పేర్కొంది. ”అధిక సంఖ్యలో అధికారులను నియమించుకోవటానికి రెండు కారణాలు. ఒకటి, గవర్నెన్స్‌లో డొమైన్‌ నైపుణ్యాన్ని పరిచయం చేయటం, ఇది ఐఎఎస్‌ అధికారుల కొరతను పరిష్కరించడం కూడా” అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డిఒపిటి) అధికారి ఒకరు సెలవిచ్చారు.

*నో రిజర్వేషన్‌*

ఈ పథకానికి సంబంధించిన అతి పెద్ద అవరోధం రిక్రూట్‌ అయ్యే పోస్టులకు రిజర్వేషన్‌ను వర్తింపజేయకూడదనే ప్రభుత్వ నిర్ణయం. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇది రిజర్వేషన్లపై బిజెపి చేస్తున్న డబుల్‌ దాడి గా ఆయన అభివర్ణించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి4 తరగతులను రిజర్వేషన్లకు దూరంగా ఉంచేందుకు బిజెపి ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రణాళికాబద్ధమైన కుట్రతో ఉద్యోగాలలో ఇటువంటి నియామకాలు చేస్తున్నదని ఆరోపించారు. ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్‌ కూడా ఎక్స్‌ పోస్ట్‌లో ఈ చర్యను రాజ్యాంగంపై ”డర్టీ జోక్‌” అని అభివర్ణించారు. 2021లో, నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (ఎన్‌సిబిసి) కూడా లేటరల్‌ ఎంట్రీలలో రిజర్వేషన్లు లేకపోవటం గురించి అంతర్గతంగా ప్రశ్నలను లేవనెత్తింది. రిజర్వేషన్‌ లేకపోవటం ఒక్కటే సమస్య కాదని ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఎఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. ”ఐఎఎస్‌ అధికారుల కొరతను భర్తీ చేయటానికి.. ఇది పనికిరాని ప్రణాళిక. ప్రభుత్వంలో వెయ్యి మందికి పైగా ఐఎఎస్‌ అధికారుల కొరత ఉన్నది. 2023 ప్రభుత్వ డేటా ప్రకారం.. 1,469 మంది అధికారుల సంఖ్యకు గానూ 442 మంది ఐఎఎస్‌ అధికారులు మాత్రమే కేంద్రంలో పని చేస్తున్నారు. ఈ ఖాళీలను యుపిఎస్‌సి ద్వారానే భర్తీ చేయడం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

కీలకస్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ మనుషులను చొప్పించే యత్నమే ఇది: సీతారాం ఏచూరి
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు, రిజర్వేషన్లను తిరస్కరించేందుకే. మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి ఈ లేటరల్‌ ఎంట్రీని ఎంచుకుందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అదే యుపిఎస్‌సి సాధారణ ఎంపిక ద్వారా చేస్తే, 45 మందిలో కనీసం 23 మంది సమర్థులైన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అభ్యర్థులు ఉంటారు. మనుస్మృతి సామాజిక ఆదేశాన్ని అమలు చేయటానికే మోడీ ఇటువంటి తక్షణ చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ఇప్పటికే ఉన్న ఉద్యోగుల అవకాశాలను సైతం దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు.

యువత హక్కులను దోచుకోవడం, రిజర్వేషన్లను అంతం చేయడమే ‘మోడీ హామీ’: రాహుల్‌ గాంధీ
”ఐఎఎస్‌ వ్యవస్థను ప్రయివేటీకరించడం, రిజర్వేషన్లను అంతం చేయడమే ‘మోడీ హామీ’. ప్రభుత్వ ఉద్యోగులను లేటరల్‌ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య ”దేశ వ్యతిరేకమైనది”. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల రిజర్వేషన్లను బాహాటంగా లాక్కుంటున్నారు. యుపిఎస్‌సికి బదులుగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తూ ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. బ్యూరోక్రసీతో సహా దేశంలోని అన్ని అత్యున్నత పదవుల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండటం లేదు. దాన్ని మెరుగుపరచకపోగా, లేటరల్‌ ఎంట్రీ పేరుతో ఉన్నత పదవులకు ఆయా వర్గాలను దూరం చేస్తున్నారు. నిర్ణయాత్మక ప్రభుత్వ పదవుల్లో కూర్చోవడం ద్వారా కొన్ని కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు ఏమి చేస్తారనే దానికి సెబీ ఒక స్పష్టమైన ఉదాహరణ. ప్రయివేట్‌ రంగానికి చెందిన వ్యక్తి మాధబి బుచ్‌ని సెబి చైర్‌పర్సన్‌గా నియమిస్తే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం.

దొడ్డి దారి నియామకాలు : ఎస్‌పి అధినేత అఖిలేష్‌ యాదవ్‌
బ్యాక్‌డోర్‌ ద్వారా తన సైద్ధాంతిక మిత్రులను ఉన్నత పదవులకు నియమించేందుకు బిజెపి పన్నిన కుట్ర ఇది అని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. దీనిని కచ్చితంగా వ్యతిరేకించాలి. ఈ తిరోగమన చర్యను వెనక్కి కొట్టేందుకు దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాల్సిన అవసరముంది. ఈ పద్ధతితో సామాన్య ప్రజలు కేవలం క్లర్కులు, ప్యూన్లకే పరిమితమవుతారు. వాస్తవానికి ఇది వెనుబడిన, దళిత, మైనారిటీ వర్గాల రిజర్వేషన్‌, వారి హక్కులను లాక్కోవడమేనని సమాజ్‌వాది పార్టీ నేత అన్నారు.

రాజ్యాంగం, రిజర్వేషన్లతో చెలగాటం : తేజస్వి యాదవ్‌
మోడీ ప్రభుత్వం రాజ్యాంగం, రిజర్వేషన్లతో చెలగాటమాడుతోందని ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రిజర్వేషన్లను అంతమొందించాలని చూస్తోందని అన్నారు. రిజర్వేషన్లను అంతమొందించడం, రాజ్యాంగాన్ని రద్దు చేయడమే మోడీ ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని ఆప్‌ సీనియర్‌ ఎంపి సంజరు సింగ్‌ విమర్శించారు. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారీ హక్కులను తుంగలో తొక్కేందుకు బిజెపి ఈ లేటరల్‌ ఎంట్రీ పద్ధతిని తీసుకొచ్చిందన్నారు.

4
12930 views