logo

హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు కృషి - విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ/ నోడల్ అధికారి డి.విశ్వనాథ్




విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణమైన గుర్తు తెలియని వాహనాల కేసుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో జూలై 30న ఉదయం 11గంటలకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ మరియు నోడల్ అధికారి డి.విశ్వనాథ్ జూలై 27న ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాథ్ మాట్లాడుతూ - జిల్లాలో వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదైన రోడ్డు ప్రమాద కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనం తెలియకపోయినా, బాధితులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా న్యాయ సేవా సంస్థ వారి ఆదేశాలతో బాధితులకు అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని ఈ నెల 30న ట్రాఫిక్ పోలీసు స్టేషనులో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటికీ, ప్రమాదానికి కారణమైన వాహనం తెలియక పోయినప్పటికీ (హిట్ అండ్ రన్) ఆయా కేసుల్లో బాధిత కుటుంబాలకు నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఇందులో భాగంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ. 50వేలు చొప్పున నష్ట పరిహారంగా ఇవ్వనున్నానన్నారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసు స్టేషనులో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో బాధిత కుటుంబాలు పాల్గొనాలని, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాథ్ కోరారు.

19
1596 views