టీడీపీకి గవర్నర్ పదవి ఆఫర్.. ఆ ఇద్దరు సీనియర్ నేతల్లో ఒకరికి ఖాయం!
టీడీపీకి గవర్నర్ పదవి ఆఫర్ చేశారా
రేసులో ఇద్దరు సీనియర్ నేతల పేర్లు
సోషల్ మీడియాలో జోరుగా చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. అయితే ఈసారి పలువురు సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కలేదు.. అలాగే కొందరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు. సామాజిక సమీకరణాలు.. జిల్లాలవారీగా లెక్కలతో చంద్రబాబు సీనియర్లు కొందరికి న్యాయం చేయలేకపోయారు. అయితే ఈ క్రమంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. టీడీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌లు, పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.. గవర్నర్ పదవి రేసులో టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది.
టీడీపీ నేతలకు బీజేపీ నుంచి గవర్నర్ పదవి ఆఫర్ వచ్చిందని.. సీనియర్ నేతల్లో ఒకర్ని గవర్నర్‌గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ పదవి రేసులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయట. మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజతిరాజుకు ఈసారి టికెట్ దక్కలేదు.. ఆయన బదులు కుమార్తె అదితికి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వగా.. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కుటుంబానికి ఒకే టికెట్ అనే కాన్సెప్ట్‌తో చంద్రబాబు అశోక్‌కు టికెట్ ఇవ్వలేకపోయారు. అశోక్‌గజపతి రాజు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు.. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చి న్యాయం చేస్తారనే చర్చ మొదలైంది. అందుకే ఆయన పేరు వినిపిస్తోంది.