
జాతీయ స్థాయిలో నిర్వహించిన JEE Mains పరీక్షలలో విశాఖ విద్యార్దుల విజయ కేతనం
జేఈఈ మెయిన్స్‌లో విశాఖ విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ఈ ఏడాది రెండు పర్యాయాలు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలలో వచ్చిన మార్కుల సగటును అనుసరించి ర్యాంకులు విడుదల చేశారు. విశాఖ నగరంలో పలు కార్పొరేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 8, 9 ర్యాంకులు సాధించారు. చింతు సతీష్‌కుమార్ 8 (బీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2), రెడ్డి అనిల్ 9, మజ్జి రిషీవర్దన్ 69 (బీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 12), ఎం.మణికంఠ పృథ్వీరాజ్ 92, ఎం.సాయిశివలోచన్ 93వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఇంకా డి.శ్రీనిధి 261, వై.హర్షవర్దన్ 267, అల్లు హేమంత్ 277, ఎం.బాలాదిత్య 294, డి.మాధవరావు 373, కె.సంపత్ రాజీవ్ 439, కె.సాయిరాకేష్ 487, బి.సాహితీ 508, బి.తన్మయ్ 587, పి.సృజన్ నారాయణ 649, ఎ.రామలింగంనాయుడు 657, ఎ.సాత్విక్ 799, ఎస్.తనూజ్ 815, ఎం.భానుప్రకాష్ 820, ఇ.సుృజన 890 ర్యాంకు సాధించారు. కాగా నగరంలో కార్పొరేటర్ కళాశాలలైన శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జి, అసెంట్, శ్రీవిశ్వ, తదితర సంస్థల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. 500లోపు 100 మంది, 1000లోపు 200 మంది ర్యాంకులు తెచ్చుకున్నట్టు కళాళాలల నిర్వాహకులు చెబుతున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలని ఉంది
చింటు సతీష్‌కుమార్, 8వ ర్యాంకు (ఓపెన్ కేటగిరీ)
నగరంలోని నారాయణ కళాశాలలో చదువుతున్న చింటు సతీష్‌కుమార్ మెయిన్స్‌లో 8వ ర్యాంకు (ఓపెన్ కేటగిరీ) సాధించాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతీష్‌కుమార్ తల్లిదండ్రులు రమాదేవి, బుచ్చన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారంతో ఈ ర్యాంకు సాధించగలిగానంటున్న సతీష్ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరాలనుకుంటున్నట్టు చెప్పాడు. తదుపరి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడాలనుకుంటున్నట్టు తెలిపాడు.