నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ రూపురేఖలు మంత్రి పొంగులేటి ఆదేశాలతో రూపుదిద్దుకుంటున్న సమగ్ర మాస్టర్ ప్లాన్
నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ క్షేత్రం అభివృద్ధి కోసం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరైన సంగతి తెలిసిందే. అయితే ఈ నిధులతో పాటు ఈ చారిత్రక క్షేత్రానికి అంతర్జాతీయ స్థాయి హంగులు అద్దేందుకు ఇంకా ఎంత వ్యయం అవుతుంది, ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించిన నేపథ్యంలో గురువారం వారసత్వ శాఖ ఉన్నత స్థాయి బృందం ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది.డి.పి.ఆర్ రూపకల్పన కోసం ఉన్నత బృందం తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాటి, బుద్ధవనం ప్రాజెక్ట్ మెంటార్ సి.ఆంజనేయ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారులు, పురావస్తు నిపుణుల బృందం నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని విస్తృతంగా పరిశీలించింది. మంజూరైన రూ. 2.50 కోట్ల నిధుల వినియోగంతో పాటు, భవిష్యత్ నిధుల అంచనాలు, ల్యాండ్ స్కేపింగ్, పర్యాటక హంగుల రూపకల్పనపై నిపుణుల బృందం క్షేత్రస్థాయిలోనే.సుదీర్ఘంగా.సమీక్షించింది.ఎన్‌జీఆర్‌ఐ సహకారంతో భూగర్భ సర్వే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా, కేవలం ఉపరితల తవ్వకాలకే పరిమితం కాకుండా ఎన్‌జీఆర్‌ఐ సహకారంతో భూగర్భ జియోఫిజికల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీనిద్వారా భూగర్భంలో దాగివున్న చారిత్రక అవశేషాలను శాస్త్రీయంగా వెలికితీసి రక్షించనున్నారు. అలాగే, పర్యాటక వసతుల విస్తరణ కోసం సుమారు నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని తీర్మానించారు.ఆధునిక పర్యాటక వసతులు ఇక్కడ పర్యాటకుల కోసం చరిత్రను ప్రతిబింబించే త్రీడీ ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, ఆడియో-విజువల్ గ్యాలరీలు, ఓపెన్ ఎయిర్ అంఫీ థియేటర్, అంతర్జాతీయ స్థాయి వాకింగ్ మార్గాలు, లైటింగ్ వంటి మౌలిక వసతులను ఈ నివేదికలో చేర్చనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు, పూర్తి వ్యయ అంచనాలతో కూడిన ఈ 'సమగ్ర నివేదిక' ను రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని వారసత్వ శాఖ డైరెక్టర్ వెల్లడించారు.