కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో పేరిణి నృత్య వైభవం
కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ సహకారంతో పరంపర ఫౌండేషన్ నిర్వహిస్తున్న “గుడి సంబరాలు” సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కళాభిమానులను ఆకట్టుకున్నాయి.
నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ వ్యవస్థాపకులు ప్రముఖ నాట్యాచార్యులు గురుశ్రీ గజ్జెల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కళాకారుల బృందం పేరిణి నృత్య ప్రదర్శనను అందించారు. పురుష కళాకారులు మేళాప్రాప్తి, తహన విన్యాసాలు, శివ పంచభూత శబ్దాలతో వీరరసాన్ని ప్రదర్శించగా, మహిళా కళాకారులు స్వాగత నృత్యం, గణపతి గద్య, దేవి కైవార నర్తనం, భవాని కౌతం వంటి భావప్రధాన నృత్యాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
చివరగా “సత్యం శివం సుందరం” అంశాన్ని స్త్రీ, పురుష కళాకారులు జుగల్‌బందీగా అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇమంది వెంకట పైడరావు, తొడసం గురుదేవ్, రేగుల చందు, తోడెంగా సంతోష్, మర్కల లోహిత్, ఆరే నరేష్, మూగు సాయి కపిల్, అన్నెల దేవి రాజేష్, పల్నాటి శ్రీజ, బండారి వైష్ణవి, బండారి తేజస్విని, రామచరణి, గడ్డం విద్యశ్రీ, జక్కోజు సుఘందిని, పిడిషోజు సమీక్ష, జెట్టి రిత్విక పాల్గొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంప్రదాయ కళారూపాల వైభవాన్ని ప్రతిబింబిస్తూ కాళేశ్వరాన్ని ఆధ్యాత్మిక-సాంస్కృతిక కేంద్రంగా నిలుపుతున్నాయి.