సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ నియంత్రణ సాధ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చునని క్రోసూరు మండల ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు, ప్రదర్శన మరియు ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డెంగ్యూ లక్షణాలు, వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గుడ్డ సంచుల వినియోగాన్ని పెంచాలని మరియు వంటనూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బంది నిర్వహించిన ర్యాలీలో అందరికీ ఆరోగ్యం-అందరి బాధ్యత, పారిశుద్ధ్య నిర్మూలనే దోమల నివారణకు మార్గం, అరికడదాం అరికడదాం-దోమల వ్యాప్తిని అరికడదాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివుడు, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్, ఫార్మసిస్ట్ ఫాతిమా, స్టాఫ్ నర్స్ అంజమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమ రాజ్, ప్రహ్లాద్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు