logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బ్యాంక్ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..! ఫేక్ గోల్డ్తో ఏకంగా రూ.1.80 కోట్ల మోసం*

బ్యాంకు మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా
కోట్ల స్కాం..! ఫేక్ గోల్డ్తో ఏకంగా రూ.1.80 కోట్ల మోసం*

మెదక్, మే 16 : ఆన్లైన్ బెట్టింగుల వ్యసనం ఓ బాధ్యతాయుతమైన బ్యాంక్ మేనేజర్ను ఘరానా మోసగాడిగా మార్చిన ఘటన మెదక్ పట్టణంలో వెలుగుచూసింది. నమ్మి బాధ్యతలు అప్పగించిన బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్, భార్య, స్నేహితుల ఐడీ కార్డులతో నకిలీ ఖాతాలు తెరిచి, ఫేక్ గోల్డ్ను అసలు బంగారంగా చూపించి కోట్ల రూపాయల గోల్డ్ లోన్లు మంజూరు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్న యాదం అనిల్ ఆన్లైన్ బెట్టింగులకు బానిసైనట్లు దర్యాప్తులో తేలింది. ఆ వ్యసనం తీర్చుకోవడానికి డబ్బు కోసం తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం సహా మరికొందరి ఆధార్, పాన్ కార్డులను సేకరించి బ్యాంకులో 16 నకిలీ ఖాతాలను ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఖాతాల్లో కేవలం వన్ గ్రాము బంగారం లేదా నకిలీ బంగారాన్ని పెట్టి, వాటిని రికార్డుల్లో అసలైన బంగారు ఆభరణాలుగా నమోదు చేసి భారీ స్థాయిలో గోల్డ్ లోన్లు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో బ్యాంక్ గోల్డ్ లోన్ ఆడిటర్ శ్రీనివాసచారి సహకారం కూడా ఉన్నట్లు విచారణలో బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం, నకిలీ బంగారం ఆధారంగా ఏకంగా రూ.1.49 కోట్ల మేర గోల్డ్ లోన్లు తీసుకున్న అనిల్, ఆ మొత్తాన్ని సొంత అవసరాలకు వినియోగించాడు. అంతటితో ఆగకుండా, ఏటీఎం క్యాష్ డిపాజిట్ వ్యవస్థలో కూడా అక్రమాలకు పాల్పడి మరో రూ.31.35 లక్షలను దారి మళ్లించినట్లు తేలింది. మొత్తంగా దాదాపు రూ.1.80 కోట్ల మేర బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.

దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యాదం అనిల్ గతంలో ఆంధ్రప్రదేశ్లోని వాలేరుపాడు ప్రాంతంలో ఏపీజీవీబీ బ్యాంకులో పనిచేసే సమయంలోనూ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. పోలవరం నిర్వాసితులైన గిరిజనులను మోసం చేసి రూ.11 లక్షలు కాజేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం కూడా అతని వ్యవహార శైలి మారలేదని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మెదక్లో ఉద్యోగం పొంది మరింత పెద్ద స్కామ్కు తెరలేపినట్లు విచారణలో వెల్లడైంది.

బ్యాంక్ సీఈఓ వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మెదక్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మేనేజర్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, ఆడిటర్ శ్రీనివాసచారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు యాదం అనిల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలపై ప్రశ్నలు..
ఈ ఘటనతో బ్యాంకింగ్ రంగంలోని అంతర్గత పర్యవేక్షణ, గోల్డ్ లోన్ వెరిఫికేషన్ విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సహకార బ్యాంకుల్లో గోల్డ్ అప్రైజల్, ఆడిటింగ్ వ్యవస్థ బలోపేతం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ బంగారాన్ని అసలైనదిగా నమోదు చేసి కోట్ల రూపాయల లోన్లు మంజూరు కావడం బ్యాంక్ అంతర్గత నియంత్రణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని బయటపెడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆర్థిక లావాదేవీలు, బెట్టింగ్ యాప్ల లింకులు, ఇతర సహచరుల ప్రమేయంపై కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

77
2005 views

Comment