ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి: కలెక్టర్ జి. రాజకుమారి
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించి, విద్యార్థుల నమోదు (అడ్మిషన్ల) శాతాన్ని గణనీయంగా పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (హెడ్మాస్టర్లు), అంగన్వాడీ సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమం కింద పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు, ట్రాన్సిషన్ శాతం (పై తరగతులకు వెళ్లడం), మరియు డ్రాపౌట్స్ తిరిగి బడిలో చేరేలా (రీ-అడ్మిషన్లు) తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బడి వయసు పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలల్లో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాలలకు, ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్లకు విద్యార్థుల మార్పిడి (ట్రాన్సిషన్) వంద శాతం జరగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, నాణ్యమైన విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు