logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి ప్రతినిధి
తేదీ:12-05-2026

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రభుత్వ నిర్దేశిత విధానాల ప్రకారం సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, టార్పాలిన్లు, క్లీనింగ్ మెషీన్లు తదితర అవసరమైన పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హమాలీల సమస్యలు ఎక్కడా తలెత్తకుండా గుత్తేదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహించిన పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.
జిల్లాల లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, సమస్యలు ఉన్న కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద గ్రామ స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదాములు అందుబాటులో లేని ప్రాంతాలలో తాత్కాలికంగా ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లలో ధాన్యం నిల్వ ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు అందుబాటులో లేని చోట ట్రాక్టర్లు, ఇతర రవాణా వాహనాలను వినియోగించి ధాన్యం రవాణా చేపట్టాలని తెలిపారు.
వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ రైతులకు తగిన సూచనలు అందించాలని, కొనుగోలు ప్రక్రియపై ప్రతికూల వార్తలు వచ్చిన సందర్భంలో జిల్లా కలెక్టర్ల పేరుతో వెంటనే రిజాయిండర్లు విడుదల చేయాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే జరగాలని, నేరుగా మిల్లులకు తరలించే చర్యలు చేపట్టవద్దని మిల్లర్లకు వివరించాలని తెలిపారు. టోకెన్ వ్యవస్థ, రసీదు విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ భారీ స్థాయిలో పెండింగ్లో ఉన్న TAB ఎంట్రీలను వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. DCO, DRDA అధికారులు అన్ని పెండింగ్ PPCలపై ప్రత్యేక దృష్టి పెట్టి TAB ఎంట్రీలను తక్షణమే పూర్తి చేయాలని, రైతులకు MSP చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు.
అలాగే అన్ని డిస్ట్రిక్ట్ మేనేజర్లు PPCల వద్ద సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచి ధాన్యం లిఫ్టింగ్, రవాణా వేగవంతం చేయాలని సూచించారు. DCSO మిల్లుల వద్ద వాహనాల అన్లోడింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ మిల్లర్లతో సమన్వయం చేసుకుని వాహనాలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం రక్షణ కోసం అన్ని PPCలు, మిల్లుల వద్ద తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని DMOకు ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు, రవాణా, TAB ఎంట్రీలు, ట్రక్ చిట్ జనరేషన్, మిల్లర్ అక్నాలెడ్జ్మెంట్ ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) గిరి, సివిల్ సప్లై అధికారి వెంకటేష్, DCO రామ్మోహన్, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, మార్కెటింగ్ అధికారి రమ్య, DRDA సురేందర్, RTO శ్రీనివాస్, DM శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

50
1877 views

Comment