నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యం
నైతిక బాధ్యతగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి.
23 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర ప్రభుత్వం: BSDP జయశంకర్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
జయశంకర్ భూపాలపల్లి, మే 12: జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష అయిన NEET నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ (BSDP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 23 లక్షలకుపైగా విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. NEET ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయాల్సి రావడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
గతంలో 2024, 2025 సంవత్సరాల్లో కూడా ప్రశ్నాపత్ర లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన Rajasthan, Maharashtra, Uttarakhand రాష్ట్రాల్లో లీకేజీ ఘటనలు వెలుగులోకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
మొత్తం 720 మార్కులకు గాను సుమారు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు గెస్ పేపర్ పేరుతో పరీక్షకు ముందురోజే బయటకు రావడం ఈ లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగిందని సూచిస్తోందన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా అత్యంత పకడ్బందీగా NEET పరీక్షను మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ కోరారు.