మీ ఆయన పోలీసైతే బస్సు డ్రైవర్ను చెప్పుతో కొడతావా! ఇదేం ఘోరం?
అవనిగడ్డ డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం
మీ ఆయన పోలీసైతే బస్సు డ్రైవర్ను చెప్పుతో కొడతావా! ఇదేం ఘోరం?
జర్నలిస్టు : మాకోటి మహేష్
మీ ఆయన పోలీసైతే మాత్రం బస్ డ్రైవర్ను చెప్పుతో కొడతావా తల్లీ! ఇదేం ఘోరం?" అంటూ సామాన్య జనం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలేం జరిగింది?
అవనిగడ్డ డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని పులిగడ్డ నాలుగు రోడ్ల సెంటర్లో విజయవాడ కరకట్ట బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. అయితే ఆ స్టాప్లో బస్సు ఆగకపోవడంతో ఒక మహిళ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
వెంటనే తెలిసిన వ్యక్తిని పిలిపించి ఆయన మోటారు సైకిల్ పై ఎక్కి బస్సును వెంబడించారు. మోపిదేవి టోల్ ప్లాజా సమీపంలో బస్సును ఆపాలని మళ్ళీ చేయి ఎత్తారు. అక్కడ కూడా డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో ఆమె కోపం నషాళానికి అంటింది. పట్టువదలని విక్రమార్కుడిలా అదే బైక్పై సుమారు 6 కిలోమీటర్లు ప్రయాణించి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం వద్ద బస్సును అడ్డుకున్నారు.
బస్సు ఆగగానే డైవర్ దగ్గరకు వెళ్లిన సదరు ఆ మహిళ.. రెండు చోట్ల చేయి ఎత్తినా ఎందుకు ఆపలేదని నిలదీశారు. ఈ క్రమంలో డ్రైవర్ కూడా గట్టిగానే పరుష పదజాలంతో బదులివ్వడంతో ఆమె సహనం కోల్పోయింది. తన కాలి చెప్పు తీసి డ్రైవరు ఎడాపెడా కొట్టింది.అంతటితో ఆమె కోపం చల్లారలేదు. వెంటనే చల్లపల్లి బస్టాండ్ వద్దకు తన బంధువును ఫోన్ చేసి పిలిపించారు. బస్సు అక్కడికి చేరుకోగానే, ఆ బంధువు కూడా డ్రైవర్పై మరోసారి చెప్పుతో దాడి చేశారు.
పోలీస్ భార్య కావడంతో రాజీ?
ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన డ్రైవర్పై ఇలా నడిరోడ్డుపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. దాడి చేసిన మహిళ ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య కావడంతో, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా రాజీచేసి పంపించారు. దీంతో ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన వారి కుటుంబ సభ్యులే ఇలా నిబంధనలు అతిక్రమించి దాడులకు దిగడంపై ఆర్టీసీ కార్మికులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.