logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి

*అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?*

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ నియామకాల వల్ల సాధారణ నియామకాల అవకాశాలు తగ్గి, నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని స్పష్టం చేసింది.

2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలో భర్తీ అయినట్లు కోర్టు గుర్తించింది. ఏటా సగటున రెండు వేల నియామకాలు జరుగుతున్నాయని, ఇది సాధారణ నియామకాల కంటే అధికమని వ్యాఖ్యానించింది. దీంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కరువవుతున్నాయని అభిప్రాయపడింది.

కోర్టు అభిప్రాయం ప్రకారం కారుణ్య నియామకం అనేది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకునే మినహాయింపు మాత్రమే. కానీ ప్రస్తుతం ఒకే కుటుంబంలో మూడో తరానికి చెందిన వారికి కూడా ఈ కోటాలో ఉద్యోగాలు లభిస్తున్న ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంది.

ఇది విధాన లక్ష్యాన్ని దూరం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఉద్యోగి మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే కారుణ్య నియామకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నియంత్రణ లేకుండా ఈ విధానం కొనసాగితే ప్రతిభావంతులైన నిరుద్యోగుల అవకాశాలు మరింత తగ్గిపోతాయని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మూడు నెలల్లోగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. కుటుంబ ఆర్థిక స్థితి అంచనా, ఉద్యోగానికి బదులుగా ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అవసరమైతే తాత్కాలిక లేదా అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

అదేవిధంగా ఎక్స్‌గ్రేషియా చెల్లింపులపై కూడా కోర్టు మార్పులు సూచించింది. 2017లో జారీ చేసిన జీఓ ప్రస్తుత జీవన వ్యయాలకు సరిపడదని పేర్కొంది. మరణించిన ఉద్యోగి చివరి వేతనం, మిగిలిన సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్స్‌గ్రేషియాను నిర్ణయించాలని సూచించింది. ఉద్యోగిపై ఆధారపడిన వారి నిర్వచనాన్ని కూడా కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది.

1
100 views

Comment