ఎగువ అహోబిలంలో అగ్నిప్రమాదం. కాలిబూడిదైన సిబ్బంది షెల్టర్
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ కారంజ నరసింహస్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ (కంటైనర్) ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో కలకలం రేపింది.ఆదివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఈ క్రమంలో శ్రీ కారంజ నరసింహస్వామి గేట్ వద్ద ఉన్న సిబ్బంది షెల్టర్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కంటైనర్ లోపల ఉన్న వస్తువులేవీ కాపాడే వీలు లేకుండా పోయింది.
ఆలయ భద్రతకు సంబంధించి కంటైనర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. లోపల భద్రపరిచిన సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డింగ్ సామాగ్రి, హార్డ్ డిస్క్‌లు మరియు దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు మంటలకు ఆహుతయ్యాయి. ఘటన జరిగిన వెంటనే దేవస్థానం అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆలయ విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయా అన్న కోణంలో సిబ్బందిని విచారిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాద సమయంలో సిబ్బంది ఎవరూ లోపల లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై అధికారులు విచారణను వేగవంతం చేశారు.