డిలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే... దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదు అంటూ కేటీఆర్ హెచ్చరిక
మూడేళ్లుగా ఇదే మా పార్టీ స్టాండ్ అన్న కేటీఆర్
నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణగానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు
ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మూడేళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్‌కే కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు
తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు