ఆళ్లగడ్డలో గంజాయి సాగుదారు అరెస్ట్.3 కిలోల పైగా స్వాధీనం
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ మండలంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఏఎస్పీ (ASP) మందా జావలి కేసు వివరాలను వెల్లడించారు.ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన కొండబోయిన నరసింహుడు (65) అనే వ్యక్తి తన పొలం సమీపంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసు బృందం దాడులు నిర్వహించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 3 కిలోల 250 గ్రాముల బరువున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారిమఠం ప్రాంతం నుండి గంజాయి విత్తనాలను తెచ్చి, ఇక్కడ రహస్యంగా సాగు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ సందర్భంగా ఏఎస్పీ మందా జావలి మాట్లాడుతూ, యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి వంటి మాదక ద్రవ్యాల పట్ల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోం, అని ఆమె హెచ్చరించారు.గంజాయి సాగుపై సమాచారం ఉన్నవారు ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఆళ్లగడ్డ రూరల్ సీఐ బివి రమణ, ఎస్సై వరప్రసాద్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.