logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోడ్డు భద్రతపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్


చుంచుపల్లి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సోమవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 6 నుండి ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి వారం వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు డీ-అడిక్షన్ కౌన్సిలింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములుగా చేసుకుంటూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు . రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని అన్నారు . ఈ గ్రామసభల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించడం, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ప్రమాదాల సమయంలో అంబులెన్స్ సేవలు సమయానికి అందుబాటులో ఉన్నాయా, సమీప ఆసుపత్రులకు కనెక్టివిటీ ఎలా ఉందనే అంశాలను కూడా ఈ గ్రామసభల ద్వారా సమీక్షిస్తున్నామని వివరించారు.
పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా వారు తమ తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను తెలియజేసేలా చేయాలని సూచించారు. ఇది ఏ ఒక్క శాఖకు సంబంధించిన విషయం కాదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాద రహిత జిల్లాను సాధించగలమని అన్నారు.కొన్ని జిల్లాలో అమలు చేస్తున్న “నో హెల్మెట్ – నో ఎంట్రీ వంటి వినూత్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, అలాంటి ఆలోచనలను మన జిల్లాలో కూడా అనుసరించాలని సూచించారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని , వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు.అన్ని శాఖలు సమన్వయంతో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గ్రామస్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్పంచ్ భూక్య శాంతి శ్రీ, తాసిల్దార్ నాగరాజు, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, రవాణా, పోలీస్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

13
474 views

Comment