logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అలనాటి నాటక ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికం…

నిన్న సాయంత్రం రవీంద్ర భారతి పైడిరాజు ప్రివ్యూ థియేటర్లో సాయంత్రం 6 గంటల నుంచి ‘అలనాటి నాటక ప్రస్థానం‘ అని దృశ్య శ్రవ్య కళారూపకం ప్రదర్శన జరిగింది. రూపకర్త డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారు సమర్పకులు అప్పాజోస్యుల సత్యనారాయణ గారు. కార్యక్రమం తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ , రసరంజని ఆధ్వర్యంలో జరిగింది.
డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారు పాతతరం నటుల నటనా వైభవాన్ని వారి పద్య నాటకప్రదర్శనని వారు నటించిన కొన్ని చిత్ర సన్నివేశాలని గుదిగుచ్చి తెలుగు నాటక రంగస్థలంలో వారికి ఉన్న అపారమైన అనుభవాన్ని మన కళ్ళముందు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం ఈ అలనాటి నాటక ప్రస్థానం.
10 గంటల కార్యక్రమాన్ని ఒక్కసారిగా చూడడం కష్టం కనుక అందులో ఎంపిక చేసిన కొందరు పాడిన పద్యాలని నటనని చూపించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరి గురించి వారి చిత్రపటం చూస్తూ వారి వివరం వింటూ వారు పద్యం పాడుతుంటే … మనకున్న నాటక సంపత్తి ఏంటో సుస్పష్టంగా అందరికీ అవగతమైంది . ఎంత మంచి గొప్ప నాటక నటులను మనం కలిగి ఉన్నాము వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ! వారికున్నటువంటి ప్రతిభ పాఠవం ఏమిటో ఆకాసేపటికే అర్థం అయింది.
నాటక రంగంలో ఒక నాటకం వేసిన తర్వాత అది తిరిగి ఆ ప్రదర్శన మళ్లీ మనకు చూసే అవకాశం వాళ్ళు తిరిగి ప్రదర్శిస్తే తప్ప కనిపించదు. అలాగే ఆ నాటకాన్ని ముద్రిస్తే తప్ప ఆ నాటకం చదివితే అందులో ఉన్న సంభాషణలు కానీ కథ కానీ ఇతివృత్తం కానీ తిరిగి మనం చూసుకునే అవకాశం ఉండదు. అయితే చాలా నాటకాలకి పుస్తకాలు ప్రింటులు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు ఇప్పుడే కొన్ని పుస్తకాలు అచ్చు అవుతున్నాయి అలాగే ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోలు రూపొందిద్దుకుంటున్నాయి కొంతమంది లైవ్ పెడుతున్నారు కొంతమంది వీడియోలు చేసి మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు.
పెద్ద వయసు వారికి తప్ప ప్రశాంతంగా కూర్చుని పుస్తకం తీసి చదివే ఓపిక తీరిక, లేదా ఒక నాటక సభకు వెళ్లి ఆసాంతం నాటకం చూసి వచ్చేటువంటి ఆసక్తి కనిపించడం లేదు నేటి యువతరానికి . వారు అందిపుచ్చుకుంటే నాటకం మరిన్ని కొత్త కోణాలలో అద్భుతమైన ఆవిష్కరణగా మిగిలిపోతుంది. వారిని ఆకట్టుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన నాటక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది . అందుకు దిశా నిర్దేశం చేస్తూ మనకున్నటువంటి నాటక సంపత్తిని చూపించే ప్రయత్నమే అలనాటి నాటక ప్రస్థానం.
ఆ కాలం నాటి ఒక్కొక్క నటులు వారి పద్యాలను పాడుతూ ఉంటే మన పద్య నాటక వైభవం ఎటువంటిదో కళ్ళముందు సాక్షాత్కరించింది. అప్పటికాలంలో సరైన సౌండ్ సిస్టం మైకులు లేకపోవడం వలన హార్మోని పెట్టె ముందు అతిపెద్ద గొంతుతో వాళ్లు పాడినటువంటి పద్యాలను తిరిగి మన కున్నటువంటి ఆధునిక సౌకర్యాలతో అదే పద్యాలను చక్కని సంగీతంతో వినిపించినట్లైతే ఆ పద్యాలు ఎంత బాగా ఉంటాయో చూపించే అవకాశం ఈ వీడియోని చూసిన తర్వాత మనకు కలుగుతుంది. పాత తరం నేటితరం అందరినీ పరిచయం చేయడానికి ఒక కొత్త మార్గం రూపొందింది. అందుకు తగిన కృషిని చేసినటువంటి డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారికి వారికి సహకరించిన సమర్పకులు అప్పా జోస్యుల సత్యనారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు.
నిన్నటి సభకు సభాధ్యక్షులుగా ఆచార్య డి.ఎస్.ఎన్ మూర్తి గారు వ్యవహరించారు ముఖ్యఅతిథిగా మనందరి ఆత్మీయ నాటక బంధువు కెవి రమణాచారి గారు పూర్వ సలహాదారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విశిష్ట అతిథులుగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారు, డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు , సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత సమన్వయ కర్తగా డి రామకోటేశ్వరరావు గారు సభా నిర్వహణ చేసారు . సభకు శ్రవ్య దృశ్య సంధానకర్తగా డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సమర్పకులుగా ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు పౌండేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఆసక్తికరమైన ఉపన్యాసాలతో సభా కార్యక్రమం అద్భుతంగా సాగింది. చాలా గొప్ప కృషి అని ఆచార్య బిఎస్ఎన్ మూర్తి గారు, డాక్టర్ కందిమళ్ల సాంబ శివరావు నిరంతరం నాటకం కోసం కృషి చేస్తున్నారని, వారి కృషి గణనీయమైనదని డాక్టర్ కె.వి రమణాచారి గారు, ఇటువంటి పరిశోధనలు మరెన్నో జరగాలని ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు, ఈ కార్యక్రమం, ప్రయత్నం ముందు తరాల వారికి మనమిచ్చే వారసత్వ వీలునామా అని డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు అన్నారు. డాక్టర్ అప్పాజోస్యుల సత్యనారాయణ గారు నేటితరం ఆసక్తి చూపక పోవడానికి కారణం వారి తప్పు కాదని వారికి దీనికి సంబంధించినటువంటి విషయపరిజ్ఞానం లేదని అది నేర్పించే ప్రయత్నం మనం చేయాలని అన్నారు.
కార్యక్రమంతిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న సాంబశివరావు గారు ఈ ప్రయత్నం వెనుక ఉన్న తన అనుభవాలని కొన్ని పంచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఉందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. సాధ్యమైనంతగా అన్ని ప్రదేశాలకి అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలన్న సంకల్పాన్ని మీరంతా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. వందన సమర్పణ చేస్తూ డి గ్రామ కోటేశ్వరరావు గారు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారు చేసిన కృషి ప్రశంసనీయమని వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసి మార్చ్ 25 26 27 తేదీలలో ఉన్న రసరంజని వార్షికోత్సవాలకి అందరికీ ఆహ్వానం పలికారు.
నా మట్టుకు నాకు ఈ సభ చాలా సంతృప్తినిచ్చింది నేను పరిశోధకురాలుగా పిహెచ్డి చేసినప్పుడు అజో - విభో కందాళం వారి ప్రచురణలో ఉన్నటువంటి పుస్తకాలని చదువుతున్నప్పుడు అధ్యక్షులు అప్పాజోస్యుల సత్యనారాయణ గారిని చాలాసార్లు తలుచుకున్నాను వారిని ప్రత్యక్షంగా చూడడం వారికి నా తెరవెనుక పుస్తకం అందించడం వారి ప్రసంగం వినడం చాలా సంతృప్తినిచ్చింది. అదేవిధంగా చూపించిన గంట దృశ్య శ్రవ్య రూపంలో బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తో నేను నా పిహెచ్డీ లో ఇంటర్వ్యూ తీసుకోవడం నా అదృష్టంగా భావించాను అదేవిధంగా చాట్ల శ్రీరాములు గారి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను వీరిద్దరి యొక్క రూపకం చూస్తుంటే వారితో మాట్లాడిన అనుభవాలను నెమరు వేసుకున్నాను . వారి దీవెనలు నాకు అందడం ఓ వరం . మరొక విశేషం నా పి హెచ్ డి కోసం నేను ఇంటర్వ్యూ తీసుకున్న డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారు , డా. దీర్ఘాసి విజయభాస్కర్ గారు కూడాఇదే సభలో ఉండడం నా అదృష్టం.

0
78 views

Comment