వేటపాలెంలో దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో జాప్యం – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
వేటపాలెం, మార్చి 23:
వేటపాలెం మండలంలో దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి బాపట్ల జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఈరోజు వేటపాలెం ఎంపీడీవో రాజేష్ బాబు గారిని కలిసి సమస్యలను వివరించారు. పలుమార్లు దృష్టికి తీసుకువచ్చినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పలు పథకాలను అమలు చేస్తుండగా, మండల స్థాయిలో అవి సకాలంలో అందకుండా పరిపాలనా లోపాలు అడ్డంకిగా మారుతున్నాయని విమర్శించారు.
ముఖ్యంగా మండలంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, కొత్త గ్రూపులను ఏర్పాటు చేయడం వంటి అంశాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రూపులు కూడా సరైన పర్యవేక్షణ లేక నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు.
మండలంలోని అన్ని స్వయం సహాయక సంఘాల స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించి, బ్యాంకు రుణాలు మరియు సంక్షేమ పథకాల అమలుపై చర్చించాలని అధికారులను కోరారు. అలాగే నిలిచిపోయిన గ్రూపులను పునరుద్ధరించేందుకు సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, సదరం సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ అంశంపై పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల వైఖరిలో మార్పు కనిపించలేదని విమర్శించారు.
జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష అనేది తగదని హెచ్చరించారు. అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
మండలంలోని సచివాలయాల్లో వీల్‌చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా మరోసారి గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ కాలేషా, ఎస్. రమేష్, ఎం. కృపారావు తదితరులు పాల్గొన్నారు.