logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

టి.ఎల్‌. కాంతారావు

టి.ఎల్‌. కాంతారావు పేరు చెప్పగానే మనకు ఆయన నటించిన సుమారు 50 జానపద సినిమాలు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తాయి. ధైర్యవంతుడు, సాహసవంతుడూ అయిన రాకుమారుడు మాంత్రికుని మాయాజాలం నుండి తన రాజ్యాన్ని, రాకుమారిని ఎలా రక్షిస్తాడో కాంతారావు సినిమాలు చూస్తే మనకు ఒక స్వాప్నిక జగత్తు ఆవిష్కారమవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వారి చేతుల్లో, ఒకే సామాజిక వర్గం కనుసన్నల్లో నడిచే తెలుగు సినిమా రంగంలో ఒక తెలంగాణవాడిగా, ఒక అగ్ర హీరోగా కాంతారావు నిలదొక్కుకుని మనగలిగాడంటే అదొక అరుదైన జీవన విజయగాథ. అతడు మనవాడు. మన కథానాయకుడు. అచ్చ తెలంగాణవాడు.
......
నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో తాడేపల్లి కేశవరావు - సీతారామమ్మ దంపతులకు 1923 నవంబర్‌ 16న జన్మించారు కాంతారావు. మూడేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారాయన. కోదాడలోనే ఉర్దూభాషలో వస్తానియా (7వ తరగతి) వరకు చదువుకున్నారాయన. చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్న కాంతారావు రంగస్థలంపై చిన్న చిన్న వేషాలు వేశారు. తన 15వ ఏట చదువు చాలించిన ఆయన సొంతవూరిలోనే వంశపారంపర్యంగా సంక్రమించే 'పటేల్‌'గా ఉద్యోగంలో చేరారు. బహుశా ఈ ఉద్యోగం వల్లనే ఆయన నటనాకాంక్షను నెరవేర్చుకో
గలిగారనిపిస్తుంది. ఆ రోజుల్లో ఊరి 'పటేల్‌ గిరి' లో ఉండటం వల్ల ఆయన మాటంటే ఊరికంతా శిలాశాసనంలా ఉండేది. ఆ సమయంలోనే ఒకసారి తమ వూరికి 'సురభి' నాటక కంపెనీ వచ్చింది. వాళ్లంతా కొన్నాళ్లు అక్కడే మకాం వేసి వరుసగా నాటకాలు వేయాలను
కున్నారు. ఊరి పటేల్‌ మన కాంతారావు గనుక, ఆయన అనుమతి తప్పనిసరి. కాబట్టి వెళ్లి కలిశారు. ఎట్లయినా తాను అనుమతి ఇస్తేనే నాటకాలు ఆడతారని గ్రహించిన కాంతారావు నటించాలనే తన కోర్కెను తీర్చుకోవడానికి ఇదే అవకాశమని 'నాకు మీ నాటకాల్లో వేషాలిస్తే అనుమతిస్తా'నని షరతు పెట్టారు. దీంతో వాళ్లు అయిష్టంగానే ఒప్పుకున్నారు.
......
ఆ విధంగా తొలిసారిగా సురభి నాటక సమాజం వారి నాటకంలో బ్రహ్మదేవుని వేషం వేశారు కాంతారావు. ఆ తరువాత మధుసేవ, కనకతార, గయోపాఖ్యానం వంటి తెలుగు నాటకాల్లో, హిందీలో మేవాడ్‌, బొబ్బిలి వంటి నాటకాల్లో నటించారు. ఇంతలో ఆయన మనసు సినిమాలవైపు మళ్లింది. అప్పటికే ఖర్చులకు పదెకరాల భూమి అమ్మివేశారాయన. ఆ డబ్బుతో మద్రాసు వెళ్లారు. 1952 డిసెంబర్‌లో విడుదలైన 'ఆదర్శం' సినిమాలో ఇద్దరు హీరోల్లో ఏదో ఒక వేషం వస్తుందని ఆశించినా ఏ అవకాశం రాలేదాయనకు. ఆ రెండు వేషాలూ జగ్గయ్య, రామశర్మలకు దక్కినవి. ఇది తెలంగాణ నిర్మాతలు తీసిన తొలిచిత్రం. మద్రాసులో సినిమాల్లో నటించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో కాంతారావు ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యకాలంలో మద్రాసులో వేసిన 'మేవార్‌' నాటకంలో 'మొహబ్బత్‌ఖాన్‌' వేషం వేయవలసిన టి.కృష్ణ (ఎడిటర్‌) కారణాంతరాల వల్ల పాల్గొనలేక
పోతున్నానని ఆ పాత్రను కాంతారావును వేయవలసిందిగా కోరారు. అప్పటికే పలు హిందీ నాటకాల్లో నటించిన అనుభవం ఉండటం వల్ల ఆ వేషం కాంతారావు వేశారు. నాటకంలో ఆయన నటన చాలామంది ప్రశంసలందుకున్నది. మరునాడు టి.కృష్ణను కలవడానికి 'రోహిణీ' ఆఫీసుకు వెళ్లారు.
.....
అప్పుడు టి. కృష్ణ రోహిణీ వారి 'నిర్దోషి' (1851) సినిమాకు పనిచేస్తున్నాడు. ''సినిమాల్లో నటించాలనే సరదా తీరకుండానే ఎట్లా పోతా''వని 'నిర్దోషి'లో ఒక పల్లెటూరి రైతు వేషం వేయించాడు. ఒకే ఒక్క డైలాగ్‌ ఉన్న పాత్ర! కానీ ఆయన నటన, పలుకు రెండూ నచ్చి వెంటనే ఆ పాత్రకు నాలుగు డైలాగులు రాయించి రీషూట్‌ చేయించారు దర్శకుడు హెచ్‌.ఎం. రెడ్డి. సరిగ్గా ఇక్కడే కాంతారావు నట జీవితం మలుపు తిరిగింది. నటనలో నిగూఢమైన మెరుపును కనిపెట్టిన రెడ్డిగారు కెమెరామెన్‌ పి.ఎల్‌. రారుని పిలిచి ముఖవర్చస్సును, సౌండ్‌ ఇంజనీర్‌ని పిలిచి డైలాగ్‌ డెలివరీ పరిశీలించి ''ఇతడే నా తరువాతి సినిమా హీరో'' అని ప్రకటించారు. అట్లా తెలుగు సినిమా రంగంలోకి తొలి తెలంగాణ హీరో ప్రవేశం జరిగింది. దాదాపుగా ఇదే కాలంలో ఆర్‌. నాగేశ్వరరావు వచ్చినా అతడు విలన్‌ వేషాలకు ఎంపికైనారు. 1953లో ''ప్రతిజ్ఞ'' సినిమాతో మన కాంతారావు హీరోగా వెండితెరకు పరిచయమైనారు. అదీ తెలుగు, తమిళ భాషల్లో. తమిళంలో బాగా ఆడకపోయినా తెలుగులో శతదినోత్సవాలు జరుపుకున్నది. హీరోయిన్‌గా సావిత్రి. ప్రతి నాయకునిగా నెల్లూరు రాజనాల కల్లయ్య నటించాడు. అయితే రాజనాలకు మొదటి నుండీ హీరో వేషంపై మోజు ఉండటంతో తనకు విలన్‌ వేషం వచ్చినా యూనిట్‌ వారిని మేనేజ్‌ చేసుకుని టైటిల్స్‌లో తన పేరు ముందుగా, తరువాత కాంతారావు పేరు వచ్చేటట్లు చేశారు. దాంతో కాంతారావును విలన్‌గా అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి చాలాకాలమే పట్టింది మన కాంతారావుకి. తెలుగు సినిమా రంగంలో తెలంగాణ వారి పట్ల ఎలాంటి వివక్ష వుంటుందో ఈ సంఘటన మనకు నిదర్శనంగా నిలుస్తుంది.
......
1953లో ''ప్రతిజ్ఞ'' సినిమాతో మన కాంతారావు హీరోగా వెండితెరకు పరిచయమైనారు. అదీ తెలుగు, తమిళ భాషల్లో. తమిళంలో బాగా ఆడకపోయినా తెలుగులో శతదినోత్సవాలు జరుపుకున్నది. 'ప్రతిజ్ఞ' సినిమా విజయవంతమైనా ఆ వెంటనే రెండో సినిమాకు అవకాశం రాలేదు. రెండేళ్ల తరువాత గాని విఠలాచార్య సాంఘిక చిత్రం 'కన్యాదానం' (1955)లో నటించారాయన. ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఎన్‌.టి.ఆర్‌. తీసిన 'జయసింహా' (1955)లో తమ్ముడు విజయసింహుడు వేషం ఇచ్చారు. జయసింహ గొప్పవిజయం సాధించి కాంతారావుకి మంచి పేరు రావడమే గాక భవిష్యత్తుకు ఆటంకాలు లేని బాట వేసిపెట్టింది. ఆ తరువాత 'భక్తమార్కండేయ', 'గౌరీమాహాత్మ్యం' (శివునిగా), 'ఇలవేలుపు'లో గెస్ట్‌రోల్‌లో (1956), 'సతీ అనసూయ' (1957), శ్రీరామాంజనేయ యుద్ధం, గంగా గౌరీ సంవాదం (1959) పౌరాణిక చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న వేషాలు వేసిన కాంతారావు నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు విఠలాచార్య. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సినిమాలు నిర్మించి విడుదల చేయడం ఆయనలోని ప్రత్యేకత.
......
ఆ తరువాత విఠలాచార్య తానొక జానపదం తీయాలనుకుని కాంతారావును హీరోగా ఎంపిక చేసుకుని 'జయ-విజయ' (1959) తీశారు. ఈ సినిమా విజయం సాధించడంతో కాంతారావు - విఠలాచార్యల కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ జానపదాలు రూపొంది తెలుగు సినిమారంగంలో జానపద చిత్రాలకు ఒక అధ్యాయం ఏర్పడింది. విఠలాచార్య డైరెక్షన్‌లో కాంతారావు 'కనకదుర్గ పూజా మహిమ' (1960), 'వరలక్ష్మీ వ్రతం' (1961) 'మదన కామరాజు కథ' (1962), గురువును మించిన శిష్యుడు' (1963), 'నవగ్రహ పూజా మహిమ' (1964), విజయసింహ (1965), 'జ్వాలాద్వీప రహస్యం' (1966), 'ఇద్దరు మొనగాళ్లు' (1967) 'భలే మొనగాడు', 'పేదరాశి పెద్దమ్మ' (1968) చిత్రాలతో కలిపి మొత్తం డజన్‌ సినిమాల్లో హీరోగా నటించారు. ఈ కాంబినేషన్‌లో కాంతారావు పక్కన నాయికలుగా కృష్ణకుమారి, రాజశ్రీలను తప్ప మరొకరిని ఆ రోజుల్లో ఊహించేవారు కారు.
......
కాంతారావు జానపద చిత్రాల విజయపరంపర అటు ఎన్‌.టి.ఆర్‌. పౌరాణిక చిత్రాలకు, ఇటు నాగేశ్వరరావు విషాద నాయక చిత్రాలకు సమాంతరంగా సాగింది. అదొక ప్రభంజనం. ఆ ప్రభంజనం ఎన్‌.టి.ఆర్‌.ని సైతం జానపదాల్లో నటించక తప్పని పరిస్థితిని కల్పించింది. కాంతారావుతో కలిసి 'చిక్కడు-దొరకుడు', 'మర్మయోగి' జానపదాల్లో నటించారాయన.
ఇక వేగంగా సినిమాలు తీసేవారికి, జానపద చిత్రాలు తీసేవారికి కాంతారావు ఏకైక హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ తరువాత జి. విశ్వనాథం, సి.ఎస్‌. రావు, కె.ఎస్‌.ఆర్‌. దాస్‌, బి.ఎ. సుబ్బారావు వంటి దర్శకులు తీసిన స్వర్ణగౌరి, నువ్వానేనా (1962), దేవసుందరి, సోమవార వ్రత మాహాత్మ్యం (1963), బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, మైరావణ (1964) విజయసింహ, ప్రతిజ్ఞా పాలన, ఆకాశరామన్న, ప్రచండ భైరవి, పక్కలో బల్లెం (1965), భూలోకంలో యమలోకం (1966), అగ్గిదొర, దేవుని గెలిచిన మానవుడు, కంచుకోట, రహస్యం (1967), వీరపూజ, అగ్గిమీద గుగ్గిలం, దేవకన్య, దేవుడిచ్చిన భర్త, రాజయోగం, రణభేరి (1968), బొమ్మలు చెప్పిన కథ, పంచకళ్యాణి-దొంగలరాణి, రాజసింహ, ఉక్కుపిడుగు, గండర గండడు (1969), మెరుపువీరుడు, జన్మభూమి, సుగుణసుందరి కథ, రైతే రాజు, ఖడ్గవీర (1970), కత్తికి కంకణం. అందంకోసం పందెం, అడవివీరులు (1971), విజయరాముడు (1974) వంటి జానపద చిత్రాలలో మన కాంతారావు కథానాయకుడుగా ఒక వెలుగు వెలిగారు.
.......
ఎన్‌.టి.ఆర్‌. శ్రీకృష్ణుడు, రాముడు వేషాలు వేయకపోతే నిర్మాతలకు కనిపించే మరో నటుడు కాంతారావు మాత్రమే. నర్తనశాల (1963), బభ్రువాహన (1964), పాండవ వనవాసం, సతీ సక్కుబాయి, ప్రమీలార్జునీయం (1965) చిత్రాలలో శ్రీకృష్ణుడుగా నటించి మెప్పించారు. కాగా శ్రీరామునిగా పాదుకాపట్టాభిషేకం (1966) వీరాంజనేయ, సతీసులోచన చిత్రాల్లో నటించారాయన. ఇంకా శ్రీకృష్ణ రాయబారం, వీరాభిమన్యులో అర్జునుడిగా కాంతారావు నటన ఎన్టీఆర్‌తో పోటీపడింది.
......
ఒకవైపు సాంఘికాలలో అక్కినేని - జగ్గయ్యల కాంబినేషన్‌, మరోవైపు జానపద, పౌరాణిక, సాంఘికాలన్నింటిలోనూ కాంతారావు - ఎన్టీఆర్‌ల జోడి విజయయాత్ర సాగించినవి. కంచుకోట, మర్మయోగి, చిక్కడు దొరకడు వంటి జానపదాలు ఇక పౌరాణికాలు సరేసరి. సాంఘికాలలో రక్త సంబంధం (1961), ఆప్తమిత్రులు (1963), దేశద్రోహులు (1964), ఆడిబతుకు (1965), పల్నాటి యుద్ధం (చారిత్రాత్మకం - 1966), ఏకవీర (1969) వంటి చాలా చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చినవి. తెలంగాణకు చెందిన ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి తన మిత్రులతో కలిసి బెంగాలీ సినిమా 'దీప్‌ జాలాజారు'ను తెలుగులో 'చివరకు మిగిలేది'గా తీశారు. ఇందులో కాంతారావుది ప్రత్యేక పాత్ర. సినిమా కళాత్మకంగా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్నది. సావిత్రి నటన ఉన్నత శ్రేణికి చెందినదిగా విమర్శకుల ప్రశంసలందుకున్నది. కానీ ఆర్థికంగా ఫెయిలైంది.
......
ఆయన నటించిన సాంఘిక చిత్రాలను కూడా ప్రస్తావించుకోవాలి. శభాష్‌ రాముడు, శభాష్‌ రాజా, బికారి రాముడు, పెళ్లికాని పిల్లలు, ఖైదీ కన్నయ్య, శాంతి నివాసం, చిట్టి తమ్ముడు, ఎదురీత, కానిస్టేబుల్‌ కూతురు, మంచిరోజులు వస్తాయి. తోబుట్టువులు, చదువుకున్న భార్య, శ్రీమతి, మా వదిన, పిన్ని, ఎవరు మొనగాడు వంటి చిత్రాలు కాంతారావు నటించిన సాంఘికాలలో కొన్ని. కృష్ణకుమారి, దేవిక, రాజశ్రీ, కాంచన, భారతి, జయంతి వంటివారు ఆయనకు రెగ్యులర్‌ హీరోయిన్లు. వారిదంతా సుమారు రెండు దశాబ్దాలపాటు సాగిన విజయవంతమైన కాంబినేషన్‌. ఆయన నటించిన సినిమాల సంఖ్య 400 పైనే.
......
క్యారెక్టర్‌ రోల్స్‌లో ఆయనది విలక్షణమైన ముద్ర. దేవుడు చేసిన మనుషులు. సాహసవంతుడు వంటి చిత్రాల్లో విలన్‌గా కూడా నటించిన కాంతారావు - బాల భారతం, మహాకవి క్షేత్రయ్య, నేరము-శిక్ష, అల్లూరి సీతారామారాజు, దేవదాసు, ఓ సీత కథ, గాజుల కిష్టయ్య, పాడిపంటలు, ముత్యాలముగ్గు వంటి సుమారు 200 చిత్రాల్లో కారెక్టర్‌ రోల్స్‌ చేశారు. ఇక డజన్ల కొద్ది టి.వి. సీరియల్స్‌లో నటించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'శంకర్‌దాదా జిందాబాద్‌' (2007).
......
ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు". కాంతారావు గారి కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
......
చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ నగరంలోని నల్లకుంటలో ఒక కిరాయి ఫ్లాట్‌లో జీవనం గడిపిన కాంతరావు గారు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన భార్య హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పదివేల రూపాయలు జీవనభృతి ఇస్తున్నది.
• శత జయంతి...
కాంతారావు శతజయంతి సందర్భంగా 2022, నవంబరు 16న ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించాడు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ర‌వీంద్ర భార‌తిలోని పైడి జ‌య‌రాజ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో కాంతారావు శ‌త జ‌యంతోత్స‌వం నిర్వ‌హించబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కాంతారావు కుమారుడు రాజా పాల్గొని కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం, కాంతారావు నటించిన 'రణభేరి' సినిమా ప్రదర్శన జరిగింది.
.....
తెలంగాణ దిగ్గజ నటుడు టీ. కాంతారావు (కత్తి కాంతారావు) పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పురస్కారాన్న వారి గౌరవార్థం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు.2024 సంవత్సరం విజయ్ దేవరకొండ గారికి 2025 సవత్సరానికి ప్రఖ్యాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గారు అందుకున్నారు.

0
46 views

Comment