ఆళ్లగడ్డలో మంట పుట్టిస్తున్న గ్యాస్ కొరత. మూతపడుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు చేదు వార్త. గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పడిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత స్థానిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న తరహా హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికే పలు సెంటర్లు మూతపడగా, మరికొన్ని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఆళ్లగడ్డ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో వందలాది మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా సిలిండర్లు సరఫరా కాకపోవడం, బ్లాక్ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకడంతో నిర్వహణ భారంగా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరల పెరుగుదల ఒకవైపు, కొరత మరోవైపు వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఒక్కో సెంటర్‌లో ముగ్గురు నుండి ఐదుగురు వరకు పని చేసే కార్మికులు ఇప్పుడు పని లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే ఈ సెంటర్లు వెలవెలబోతుండటంతో అటు వినియోగదారులు కూడా నిరాశ చెందుతున్నారు.రోజుకు రెండు సిలిండర్లు అవసరమయ్యే చోట, వారానికి ఒకటి దొరకడమే కష్టంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. గ్యాస్ కొరత వెనుక కృత్రిమ కొరత ఏమైనా ఉందా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి, చిన్న తరహా వ్యాపారులను ఆదుకోవాలని షాప్ యాజమాన్యులు కోరుతున్నారు.