బుచ్చిరెడ్డిపాలెంలో “హ్యాపీ సండే” కార్యక్రమం – శానిటేషన్ సిబ్బందికి సానిటరీ కిట్ల పంపిణీ
బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద నిర్వహించిన “హ్యాపీ సండే” కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజ మురళి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సూచనలతో ప్రతినెల రెండవ మరియు నాలుగవ ఆదివారాల్లో “హ్యాపీ సండే” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందికి సానిటరీ కిట్లను అందజేశారు. పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు శానిటేషన్ సిబ్బంది చేస్తున్న సేవలను చైర్‌పర్సన్ గారు కొనియాడారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
అలాగే ప్రజలకు పిలుపునిస్తూ, తడి చెత్తను – పొడి చెత్తను వేర్వేరు డస్ట్‌బిన్లలో వేయాలని, డ్రైనేజీ కాలువల్లో చెత్త వేయకుండా పారిశుద్ధ కార్మికులకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎరటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ కత్తి శ్రీదేవి, మెప్మా సి.ఓ నర్మద, మహేంద్ర, మున్సిపల్ ఆఫీసర్ ఆర్.ఐ ప్రకాష్, అసిస్టెంట్ ఇంజనీర్ పూజిత, వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, వాటర్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.