సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం,
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలుపై హర్షాతిరేకాలు.
మార్చి, 21. ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్.
ప్రతినిధి/రాజేంద్రప్రసాద్.
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు చాటుకున్నారు. శనివారం కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ (TGJLA) 475 అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్టాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పౌష్టికాహారం అందించడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరగడమే కాకుండా, హాజరు శాతం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి చదువుకునే పేద విద్యార్థులకు ఈ పథకం ఒక వరం లాంటిదని హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపాల్, గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, సంఘ కోశాధికారి చెలిమల జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు బి.భాస్కర్, ఎం.సుమన్, డి.శ్రీకాంత్, వై.శ్రీనివాస్, విక్రమ్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని జై తెలంగాణ, జై రేవంత్ అంటూ నినాదాలు చేశారు.