నకిలీ ఉద్యోగాల వల. అప్పుల బాధతో నిరుద్యోగి ఆత్మహత్య.
ఆళ్లగడ్డ మండలం ఎస్. లింగందిన్నె గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం వస్తుందన్న ఆశతో నమ్మి మోసపోయిన ఒక నిరుద్యోగ యువకుడు, అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామానికి చెందిన పెద్ద నాగరాజు కుమారుడు పెద్ద రాజు ఉద్యోగం ఇప్పిస్తామన్న మాట నమ్మి ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు చెందిన వ్యక్తులకు రూ. 3,20,000 చెల్లించాడు. అయితే, ఉద్యోగం రాకపోగా, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడంతో పెద్ద రాజు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. అప్పుల వారి ఒత్తిడి పెరగడం, కట్టిన సొమ్ము తిరిగి వచ్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, సోదరులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి గ్రామానికి చేరుకుని పెద్ద రాజు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేయడం అత్యంత దారుణం. రూ. 3.20 లక్షల అప్పు తీర్చే మార్గం లేక ఒక నిరుద్యోగి ప్రాణాలు తీసుకోవడం మమ్మల్ని కలిచివేస్తోంది.బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది. ఎవరూ ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోవద్దు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు.