logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు

ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటే అది అతిశయోక్తి కాబోదు. ఈ రోజు తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించిన ‘‘గళ గంధర్వుడు’’ ఉషశ్రీ గారి జన్మదిన జ్ఞాపకం !
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు ఉషశ్రీ. పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్ష వ్యాఖ్యానాలలోనూ తెలుగు శ్రోతలపై చెరగని ముద్ర వేసిన ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ.తెలుగునాట రేడియో స్వర్ణయుగవైభవాన్ని శిఖరస్థాయికి చేర్చిన దిగ్దంతులలో అగ్రతాంబూలం ఆయనదే అనడం అతిశయోక్తికాదు. ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. రామాయణ భారతాలు మానవజాతి సర్వకాలాలలోనూ సుఖశాంతులతో మనుగడ సాధించడానికి అవసరమయిన విశేషాలను అందించే గ్రంథాలు మాత్రమే అనీ, అందుచేతనే ఇవి ఇన్నివేల సంవత్సరాలు జీవించగలిగాయనీ ఉషశ్రీ అందరితో ఒప్పించగలిగారు.
.....
ఉషశ్రీ గారి అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. వారు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి ఆయుర్వేద వైద్యుడు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణం, మహాభారతం మహాభాగవతం ప్రవచనం చేశాడు. ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చాలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాథలలో మునిగి తేలేవారట.
.....
భీమవరంలో డిగ్రీ పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు ఆయనచే పునర్జన్మ అనే నాటకంలో ఒక పాత్ర వేయించాడు. అందులో ఉషశ్రీ గారి తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించారు.
.......
1979 లో పి.వి.ఆర్.కె ప్రసాద్ తి.తి.దేకి కార్యనిర్వహణ
అధికారిగా ఉన్నపుడు ఆయనచే భాగవతం రాయించి పాతికవేల కాపీలు ముద్రింప జేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించారు. అయితే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు. భారతం, రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు. ఉషశ్రీ రచనలలో ఉషశ్రీ మహాభారతం ( 4 సంపుటాలు ), సుందరకాండ , శ్రీకృష్ణావతారం , ఇంటిటా ఉండవలసిన ఉషశ్రీ రచనలు, ధర్మ సందేహాలు , మొదలైన పుస్తకములు ఉన్నవి.
.....
ఉషశ్రీ గారి ప్రవచనాలకు శ్రోతలు రేడియోల ప్రసారం మంత్రముగ్ధం అయ్యేవారు . భగవద్గీతనీ, సుందరాకాడనీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఉండేవి . ‘సమస్త సన్మంగళాని భవంతు...’ మొదలుకొని ‘స్వస్తి’ పలికే వరకూ ప్రత్యక్షరం స్పష్టంగా, సూటిగా ఉండేది. ఉషశ్రీ గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోతలు లేరని చెప్పవచ్చును . అతని వ్యాఖ్యానాలలో వీరకాకాని అంతిమయాత్ర, గోదావరి నదిపై రోడ్డు రైలు వంతెన ప్రారంభం, భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణం, కృష్ణాపుష్కరాల ప్రత్యక్ష వ్యాఖ్యానం (1980) కీర్తి కిరీటంలో కలికితురాళ్లు. సందర్భోచిత వ్యాఖ్యలు, ఆయన ఉపన్యాసాలని మళ్లీమళ్లీ వినేలా శ్రోతలను చేస్తాయి. సెప్టెంబరు 7, 1990 లో వారు పరమపదించారు.
▪️ఉషశ్రీ రామాయణము...
రామచరితం రసభరితం. రామాయణము వలె
లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదు. ఆదికవి వాల్మీకి నుంచి నేటివరకు రమణీయమైన రామకథ పలుభాషలలో, పలురీతులలో రూపుదిద్దుకుంటూ, భారతావనిలోనే కాకుండా భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్యదేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది.
......
రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించడానికి కారణం బ్రహ్మానుగ్రహం. ఆ తపస్వి సమసా నదికి స్నానానికి వెళ్ళగా ఆ నదీతీరాన ఒక కరుణ దృశ్యం కంటబడింది. ఎదురుగావున్న చెట్టుకొమ్మమీద క్రీడిస్తున్న క్రౌంచ మిథునంలో మగపక్షి, కిరాతకుడొకడు కొట్టిన బాణం దెబ్బతో నేలమీదపడి విలవిల తన్నుకొని ప్రాణాలు విడిచింది. ఆడపక్షి విలపిస్తున్నది. దాని ఆక్రందనానికి మహర్షి హృదయం కరుణార్ద్రమయింది. ఆయన హృదయశోకం శ్లోకరూపంలో రామాయణంగా వెలువడింది.
......
తెలుగుదేశంలోను, తెలుగువాజ్మయంలోను సీతారాములు ప్రకాశించే దైవదంపతులు. రామాయణం చదవడంవల్ల తల్లిదండ్రులపట్ల భక్తి, సోదరప్రీతి, జ్యేష్టానువర్తనం, లోక మర్యాదానుసరణం, ప్రతిజ్ఞాపాలనం, ఆశ్రితవాత్సల్యం, స్వామికార్యనిర్వహణం, స్వార్థపరత్వనివృత్తి, చిత్తశుద్ధి, పరోపకారబుద్ధి వంటి అనేక సద్గుణాలు అలవడడానికి అవకాశం ఉన్నది.
.....
సులభసుందరాలూ, భక్తి రసబంధురాలూ అయిన వాక్యాలతో సాగిన ఉషశ్రీ రామాయణం ఆకాశవాణి శ్రోతల నెందరెందరినో ఆకర్షించింది. దీనిని ఉషశ్రీ గా పేరుగాంచిన పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు వారు రచించారు. ఇటువంటి అత్యుత్తమ భక్తిసాహిత్యాన్ని అందరికీ అందజేయాలని సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గ్రంధాన్ని ప్రచురించింది.

0
0 views

Comment