*ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్*
*ఉగాది కవి సమ్మేళనము*
తేదీ: 17-03-2026 శేరిలింగంపల్లి చందానగర్ :" పరాభవం భయం వద్దు! పరాభవనామ సంవత్సరంలో అన్నీ పరాభవాలే జరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదనీ, ఒక్కోసారి అవమానము కూడా ఒక బహుమానము అవుతుంది అని"* హాస్యబ్రహ్మ శంకరనారాయణ అన్నారు. " *పేరులో ఏముంది పెన్నిధి అని, మన్మధనామ సంవత్సరములో అందరూ మన్మధులయ్యారా? రాక్షసనామ సంవత్సరములో అందరూ రాక్షసులయ్యారా?"* అని చమత్కారంగా ప్రశ్నించారు. ప్రసంగం యావత్తు ఛలోక్తులు కురిపించి హాస్యభరితం చేశారు.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని చందానగర్ లో గల శ్రీ విశాఖ శారదాపీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో పాలకమండలి వారి సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శన సత్యసాయి గారు జ్యోతి ప్రదీపనము చేసి ప్రారంభించారు. ఈ కవి సమ్మేళనానికి కళాసింధు డాక్టర్ ఆలపాటి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాస్యబ్రహ్మ, పాత్రికేయులు డాక్టర్ శంకరనారాయణ విచ్చేసి ప్రసంగించారు. అతిథులుగా చిత్రకవితా సామ్రాట్ చింతా రామకృష్ణారావు, V.S.R. సోమయాజులు (సాహితీ విమర్శకులు) మరియు ఆర్కిటెక్ట్ ఎండూరి సురేష్ బాబుగార్లు హాజరై వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ " *ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న సనాతన సాంప్రదాయం"* అని అన్నారు. " *ఉగాది నక్షత్ర గమనానికి ప్రతీక. తన ఊహాశక్తి, కల్పనాశక్తులనే మనోనేత్రాలతో దేనినైనా దర్శించి ముగ్ధ మనోహరముగా, సరళంగా, భావయుక్తంగా, వచన, పద్యరూపాలలో వెల్లడించే వాడే కవి"* అని అన్నారు. *"కవి నిత్యనూతన సృష్టి చేస్తూ ఉంటాడు. ఈ వసంతఋతువు నిత్యనూతనానికి ప్రతీక. వసంతకాలమున కలిగేటటువంటి సహజసిద్ధమైన, ప్రకృతి పరమైన మార్పులకు అనుగుణంగా నూతన ఉత్తేజంతో ప్రతిక్షణం కవిత్వాన్ని పండిస్తాడు. ఈ వసంతంలో మావిచిగురు తినిన కోయల ఎలా హృద్యంగా కూస్తూ ఉంటుందో కవి కూడా నిరంతరము రసాత్మకమైన తన కవితాగానంతో అందరిని ఆనందడోలికలలో మంచెత్తుతూ హృదయాలను పరవశింపజేస్తుంటాడు"* అని అన్నారు.
ఈ సందర్భంగా సుప్రసిద్ధులైన కవికోకిలలు 50 మంది తమ కవితా మాధుర్యాన్ని పంచిపెట్టి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. తదనంతరం అతిథులను, కవులను సాంప్రదాయ బద్దంగా వేదమంత్రాల నడుమ శాలువ, పగడీ, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమం ఆర్కిటెక్ట్ ఎండూరి సురేష్ బాబుగారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి సభ్యులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి విజయలక్ష్మి, వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, జనార్ధన్, G V. రావు, జిల్ మల్లేష్, నండూరి వెంకటేశ్వర రాజు మరియు శివరామరెడ్డిలతో పాటు భక్తులు కూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం తీర్థ, ప్రసాదాల వినిమయం జరిగింది.