ఆయాల వేతనాలు ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి: టేకుమల్ల సమ్మయ్య
మెట్పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 15/03/2026:
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మెట్పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఆయాల జూలై 2024 నెలకు సంబంధించిన వేతనాలను ఇప్పటివరకు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఆయాల వేతనాలు ఎందుకు నిలిపివేశారో తెలుసుకోవడానికి అనేకసార్లు సీడీపీఓ, డీడబ్ల్యూఓలను ప్రశ్నించినప్పటికీ వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సరైన సమాధానం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కావాలనే ఆయాల వేతనాలను నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని బడ్జెట్లో నిధులు కేటాయించి ఆయాల పెండింగ్ వేతనాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.