ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించాలి – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోవూరు పంచాయతీలోని ప్రతి వార్డును సందర్శిస్తానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి కోవూరు పంచాయతీలోని 1, 2 వార్డులను ఆమె సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకుని, ప్రజావసరాలకు సంబంధించిన పలు అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ శాంతి నగర్‌లో జల్ జీవన్ మిషన్ కింద రూ.1 కోటి 48 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ మరియు పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే వాటిని ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు.
అలాగే 1, 2 వార్డుల్లో కొత్తగా వేస్తున్న వాటర్ పైప్‌లైన్ల కోసం రోడ్లు తవ్వడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పనులు పూర్తి చేసి ప్రజల రాకపోకలకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు ఆమె ఆదేశించారు.
నాయకులు ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించిన ఎమ్మెల్యే, అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని అన్నారు. అవినీతి తావు లేకుండా పారదర్శకంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, రూరల్ వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కోవూరు టిడిపి మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.