logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*గ్రామీణ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి:* *జిల్లా కలెక్టర్ రాజర్షి షా*

పత్రికా ప్రకటన
మార్చి 14, 2026 – ఆదిలాబాద్



మారుమూల గ్రామాల నుంచి వెలువడుతున్న సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి వాటిని పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మందికి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులు, ఆలోచనలను ప్రదర్శించారు. ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణహిత ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అభివృద్ధి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ప్రతిభను వెలికితీయడం అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవిష్కరణలను వెలికితీసి వాటిని వ్యాపార మార్గాలుగా మలచడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానికంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆవిష్కర్తలతో ప్రత్యక్షంగా చర్చించి వారి ఆలోచనలను మరింత మెరుగుపరుచుకునే విధంగా మార్గనిర్దేశం చేసింది. ఐడియా వ్యాలిడేషన్, ప్రోటోటైపింగ్, గో-టు-మార్కెట్ స్ట్రాటజీ, నిధుల సమీకరణ, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆవిష్కర్తలకు అవగాహన కల్పించారు.
అనంతరం వినూత్న ఆలోచనలతో పాల్గొన్న యువకులు, విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి వారి ఆవిష్కరణల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆవిష్కర్తలను అధికారులు మెమెంటోలు, పూల మొక్కలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ రమేష్, డిపిఆర్ఓ ఇ. విష్ణువర్ధన్, పట్టణ తహసిల్దార్ శ్రీనివాస్, ఈడీఎం రవి, రెడ్కో డి.ఎం శ్రీనివాస్, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నికినీ వర్మ, TGIC ప్రతినిధులు ప్రణయ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

0
77 views

Comment