మహిళను గౌరవిద్దాం — సమాజాన్ని మహోన్నతం చేద్దాం....
మహిళా దినోత్సవం సందేశం
మహిళా దినోత్సవం అనేది కేవలం శుభాకాంక్షలు చెప్పే రోజు కాదు…
మహిళల గౌరవం, హక్కులు, స్వాభిమానానికి జరిగిన గొప్ప పోరాటాన్ని గుర్తు చేసుకునే రోజు.
ఒకప్పుడు ఈ దేశంలో మహిళలకు విద్య అవసరం లేదు,
ఆస్తిలో హక్కు అవసరం లేదు,
వారు కేవలం పిల్లలను కనడానికి మాత్రమే ఉన్న యంత్రాంగం అన్నట్టుగా సమాజం చూసిన రోజులు ఉన్నాయి.
అలాంటి అన్యాయ సమాజాన్ని మార్చడానికి గొంతెత్తిన మహానుభావుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు.
మహిళలకు సమాన హక్కులు రావాలని, ఆస్తిలో భాగస్వామ్యం ఉండాలని, వివాహం–విచ్ఛేదం విషయాల్లో న్యాయం జరగాలని ఆయన హిందూ కోడ్ బిల్లు తీసుకువచ్చారు.
కానీ ఆ బిల్లు అమలు కాలేదనే నిరసనగా, మహిళల గౌరవం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా రాజీనామా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
అయితే అంబేద్కర్ గారి వెనుక నిలబడి ఆయనకు జీవితాంతం అండగా నిలిచిన మహనీయురాలు
రమాబాయి అంబేద్కర్ గారు.
అంబేద్కర్ గారు చదువుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న రోజుల్లో, కుటుంబాన్ని భుజాన వేసుకుని, ఎన్నో త్యాగాలు చేసి, ఆయన చదువు కొనసాగేందుకు మౌనంగా గొప్ప పాత్ర పోషించిన మహనీయురాలు రమాబాయి గారు.
అలాగే ఈ దేశంలో మహిళలకు విద్య అనే వెలుగునిచ్చిన
మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు.
అవమానాలు, రాళ్లు, మట్టి విసిరినా కూడా వెనక్కి తగ్గకుండా అమ్మాయిలకు పాఠశాలలు ప్రారంభించి విద్య హక్కు అందించారు.
స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి వీరనారులు ఈ దేశ గర్వకారణం.
అలాగే సమాజ న్యాయం కోసం, స్వాభిమాన కోసం, హక్కుల కోసం పోరాడిన మహిళలు ఈ దేశ చరిత్రలో అజరామరాలు.
అందుకే మనం గర్వంగా చెప్పాలి —
మహిళ బలహీనత కాదు… మహిళే శక్తి!
మహిళ నవ్వితే కుటుంబం నిలుస్తుంది…
మహిళ గౌరవం ఉంటే సమాజం ఎదుగుతుంది…
మహిళకు సమాన హక్కులు ఉంటే దేశం మహోన్నతంగా మారుతుంది.
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా
మహిళల గౌరవం కోసం పోరాడిన మహనీయులకు నా వినమ్ర వందనాలు.
ప్రతి మహిళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మహిళను గౌరవిద్దాం — సమాజాన్ని మహోన్నతం చేద్దాం