*పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా*
పత్రికా ప్రకటన
మార్చి 7, 2026_ఆదిలాబాదు:
పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి అని, విద్యార్థులంతా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సరస్వతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘లక్ష్యం’ కరదీపికను ఆవిష్కరించడంతో పాటు, ‘ఆల్ ఇన్ వన్’ స్టడీ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించి, ట్రిపుల్ ఐటీ సీట్లను కూడా దక్కించుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్, డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి పదవ తరగతి ఫలితాలే పునాది అని, విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే తోటి స్నేహితులు లేదా ఉపాధ్యాయుల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలని, పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి ఉంటే ‘టెలీ మానస్’ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.
పరీక్షల మధ్య గ్యాప్ ఉన్న సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండి సందేహాలను తీర్చాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అవసరమైతే ఇతర పాఠశాలల సబ్జెక్టు నిపుణులను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇంచార్జి డిఈఓ రాజేశ్వర్, డిసిఈబి సెక్రటరీ గజేందర్, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, అజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.