మాతృభాషలో ప్రావీణ్యంతోనే ఉన్నత శిఖరాలు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతృభాషోద్యమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డిఐజీ ఐపీఎస్ అధికారి కిలాడి సత్యనారాయణ తెలుగు మాతృభాషలో ప్రావీణ్యం, పట్టుదలతో ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. తెలుగులోనే నైపుణ్యం సాధించి, అకుంఠిత దీక్షతో లక్ష్యసాధన చేస్తే గొప్ప విజయాలు సాధ్యమని ఆయన హర్షించారు.నర్సీపట్నం ప్రాంతవాసిగా విద్యార్థులలో చైతన్యం తీసుకురావడం తన సంకల్పమని కిలాడి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆల్ ఇండియా జ్యోతిరావు పూలే ఓబిసి అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు తెలిపినట్లు, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఢిల్లీలో ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. సామాజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐఐటి, ఐఏఎస్, ఐపీఎస్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యలకు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ అనుభవం కలిగిన అధ్యాపకులచే ఆన్లైన్ బోధన నిర్వహిస్తున్నారు.దిగువ మధ్యతరగతి కుటుంబాల చెందిన మంచి నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఎడాప్ట్ చేసుకొని, వారి ఉన్నత చదువులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, సత్యనారాయణ చెప్పారు. వేములపూడిలో చదువుతున్న సుమారు 150 మంది పదవ తరగతి విద్యార్థులకు స్వచ్ఛందంగా ఫీజులు చెల్లించారు. నిరుద్యోగ యువకులకు, క్రీడా ప్రోత్సాహకం కింద క్రీడా సామగ్రి, పరీక్షల సామగ్రి సమకూర్చి ప్రోత్సహించారు.కార్యక్రమంలో MPTC బోలెం రాంప్రసాద్, SMC చైర్మన్ వేమాలతల్లి, స్కూల్ హెడ్మాస్టర్ శ్రీమతి ఏ పద్మజ, ఉపాధ్యాయులు ఇ.వి.రమణ, కశిరెడ్డి అప్పలనాయుడు, కె.వి.శేషయ్య, వి.నారాయణ మూర్తి, పాఠశాల సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కిలాడి సత్యనారాయణ, పోతల ప్రసాద్ నాయుడును సత్కరించి, మాతృభాష పట్ల ప్రోత్సాహం కలిగించారు.