logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డయేరియాతో మరొకరు..లెప్రసీకాలనీకి చెందిన వృద్ధురాలి మృతి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం రూ.10లక్షల పరిహారం చెక్కు పంపిణీ

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియాతో ఇటీవల దమ్మలవీధికి చెందిన ఆటోడ్రైవర్‌ సురేష్‌ మృతి చెందగా..తాజాగా శనివారం మరో వృద్ధురాలు ఈ వ్యాధి లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానిక లెప్రసీ కోలనీకి చెందిన ఆలవెల్లి సూరీడమ్మ(65) డయేరియాతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. మొండేటివీధి జంక్షన్‌లో కూరగాయలు అమ్ముతూ ఆమె జీవనం సాగించేది. డయేరియా లక్షణాలతో బాధపడుతున్న ఆమెను బుధవారం జెమ్స్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌ పరామర్శించారు. వారికి అండగా నిలిచేలా ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారం చెక్కును అందజేశారు. సూరీడమ్మ డయేరియా వ్యాధి నుంచి కోలుకున్నా.. దురదృష్టవశాత్తు కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే శంకర్‌ విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో చేరిన బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు వేగవంతం చేశామన్నారు.

కొత్తగా ఐదు కేసులు

శ్రీకాకుళంలో డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చింది. శనివారం కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు మొత్తంగా 190 కేసులు నమోదు కాగా, అందులో 103 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 87 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఉద్యోగులపై వేటు

శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తికి అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల శ్రీకాకుళం కార్పొరేషన్‌ కమిషనర్‌ కూర్మారావును సస్పెన్షన్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నగర పాలకసంస్థ కార్యాలయంలో వాటర్‌ వర్క్స్‌ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) జగన్మోహన్‌రావును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న నలపల్ల్లి శరత్‌, వామనమూర్తిని కూడా సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 20 మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

0
0 views

Comment