logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తో రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ : ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్,

తెలంగాణ స్టేట్*** ఉమ్మడి ఖమ్మం జిల్లా*** పోలీస్ కమిషనరేట్ కార్యాలయం** ఫిబ్రవరి 27*** ఏఐఎంఏ మీడియా ప్రతినిధి




పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...

*ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తో రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ :పోలీస్ కమిషనర్*

ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.

రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతిష్ఠాత్మకంగా పోలీసుశాఖ రూపొందించిన ‘అరైవ్‌.. అలైవ్‌’ ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రియదర్శని ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రోడ్డు ప్రమాదల్లో గాయపడిన వారు కుటుంబ పోషణకు పడుతున్న ఇబ్బందులు,అనుభవాలను బాధితులు పంచుకున్నారు. విద్యార్థులు ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్లు, లారీ యూనియన్లు,కళాశాల అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్‌ అలైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సురక్షితంగా గమ్యానికి నిర్వహిస్తున్న
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్‌ సంస్కృతిని అలవాటు చేసి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రముఖులు, మీడియా, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్‌ జంప్‌, స్టాప్‌ లైన్‌ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్‌ లోడింగ్‌, ఎడమవైపు నుంచి ఓవర్‌ టేకింగ్‌ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించవు. ముందున్న వాహనం లేదా ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో, డ్రైవర్లు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని, వాన కాలం, చలి కాలంలో డ్రైవర్లు తీసుకోవలసిన కీలక జాగ్రత్తలు

1.ముందుగానే ప్రయాణం మొదలు పెట్టండి
పొగమంచు వలన ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, నిర్ణీత సమయం కంటే కొద్దిగా ముందుగానే బయలుదేరండి. తొందరపాటును నివారించడం ద్వారా డ్రైవింగ్ పై ఏకాగ్రత పెరుగుతుంది.


2.అతివేగం, ఓవర్ టేకింగ్‌కు దూరంగా ఉండండి
ముందున్న వాహనాలు, రోడ్డు స్పష్టంగా కనిపించనందున అతివేగం, ఓవర్ టేకింగ్ అత్యంత ప్రమాదకరం. వేగంగా వెళ్లడం వలన వాహనం నియంత్రణ (కంట్రోల్) తప్పే ప్రమాదం ఉంది. ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు ఎదురుగా ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టం.

3.లో-బీమ్ లైట్లనే వాడండి
పొగమంచులో హై-బీమ్ లైట్ల నుండి వచ్చే కాంతి విచ్ఛిన్నమై, ఎదురుగా చూడటం మరింత కష్టమవుతుంది. కాబట్టి, తప్పనిసరిగా లో-బీమ్ (Low-Beam) హెడ్‌లైట్లను మాత్రమే వాడండి. ఫాగ్ లైట్లు (Fog Lights) ఉన్న యెడల, వాటిని కూడా ఉపయోగించాలి. ఇది మీ వాహనం ఎంత దూరంలో ఉందో ఇతరులకు స్పష్టంగా తెలుపుతుంది.

4.సురక్షిత దూరాన్ని పాటించండి
ముందు ఉన్న వాహనానికి, మీ వాహనానికి మధ్య తగినంత సురక్షిత దూరాన్ని (Safety Distance) ఉంచండి. దీనివలన ముందు వాహనం సడన్ బ్రేక్ వేసినా, అంచనా తప్పినా దాన్ని ఢీకొట్టకుండా నివారించవచ్చు.

5.నిర్దేశించిన లేన్లలోనే నడపండి ఇష్టం వచ్చినట్లు లేన్ క్రమశిక్షణ లేకుండా నడపడం వలన ముందున్న వాహనాలను గుర్తించడం కష్టమవుతుంది. నిర్దేశించబడిన లేన్లలో మాత్రమే వాహనాన్ని నడపండి.

6.కిటికీ అద్దాలను కొద్దిగా దించండి వాహనాన్ని నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించడం వలన (పాక్షికంగా తెరవడం), పొగమంచు ఒకేదగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నమవుతుంది. దాని వలన డ్రైవర్ దృష్టి మెరుగు పడుతుంది.

7.ఎక్కువ పొగమంచు ఉంటే వాహనం ఆపండి
కొన్నిసార్లు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ముందు ఉన్న వాహనాలు, రోడ్డు సరిగ్గా కనిపించకపోతే, గమ్యస్థానానికి వెళ్లాలనే తొందరలో తప్పులు చేయకుండా, సురక్షిత ప్రదేశంలో కాసేపు వాహనాన్ని ఆపివేసి, మళ్లీ ప్రయాణం కొనసాగించండి.

8.అద్దాలను శుభ్రంగా ఉంచుకోండి పొగమంచు అద్దాలను కవర్ చేయడం వలన డ్రైవర్ దృష్టి తగ్గుతుంది. మీ వాహనం యొక్క ముందు, వెనుక కిటికీ అద్దాలను శుభ్రంగా ఉంచుకోండి. అవసరాన్ని బట్టి వైపర్లను, డీఫ్రాస్టర్లను వాడుతూ అద్దాలను స్పష్టంగా ఉండేలా చూసుకోండి.

9.ఇండికేటర్లను ముందుగా ఉపయోగించండి
మీరు ఎటువైపు వెళుతున్నారో వెనుక వచ్చే వాహనానికి ముందుగానే తెలిసేలా ఇండికేటర్లను (Indicator lights) ముందుగా ఉపయోగించండి. వెనుక వచ్చే డ్రైవర్లకు నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఇచ్చేలా సంకేతం అందించండి.

10.సడన్ బ్రేకింగ్ నివారించండి
చలికాలంలో రోడ్డు తడిగా ఉండి, వాహనాలు స్కిడ్ (Skid) అయ్యే ప్రమాదం ఎక్కువ. బ్రేకులను నెమ్మదిగా, జాగ్రత్తగా అప్లై చేయండి. సడన్ బ్రేకులు వేయడం వలన వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంది. నిర్దిష్టమైన వేగంతో వాహనాలను నడపడం ద్వారా స్కిడ్ కాకుండా నివారించవచ్చు. తెలంగాణ పోలీసు శాఖ చేసిన ఈ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించి, తమ ప్రయాణాన్ని సురక్షితంగా, విజయవంతంగా ముగించాలని విజ్ఞప్తి.

కార్యక్రమంలో RTO జగదీశ్, ఏసీపీలు తిరుపతి రెడ్డి, రమణమూర్తి, శ్రీనివాసులు,కాలేజ్ చైర్మన్ నవీన్ సిఐలు మురళి, రాజు, సంజీవ్, సత్యనారాయణ పాల్గొన్నారు.

92
2466 views

Comment