ఆళ్లగడ్డ. చక్రవర్తుల గ్రామ తండాలో మురుగు కష్టాలు పట్టించుకోని అధికారులు
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండల పరిధిలోని చక్రవర్తుల తండా పల్లె గ్రామంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీధుల్లోని సైడ్ కాలవల్లో పేరుకుపోయిన మురుగును తొలగించడంలో పంచాయతీ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. నెలలు గడుస్తున్నా సైడ్ కాలవలు తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.కాలవలు పూడికపోయి నీరు నిల్వ ఉంటున్నా పంచాయతీ పారిశుధ్య సిబ్బంది అటువైపు చూడటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న మురుగు నీటిలో దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చూస్తాం,చేస్తాం అనే సమాధానం తప్ప ఎక్కడ పని జరగడం లేదు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సైడ్ కాలవల్లో మురుగును తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.