logo

ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో 50 కోట్ల ఆస్తులు* విస్తుపోయిన ఏసీబీ అధికారులు

జర్నలిస్టు : మాకోటి మహేష్

*ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో 50 కోట్ల ఆస్తులు*
*విస్తుపోయిన ఏసీబీ అధికారులు*

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-3 ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న నల్లిపోగు తిరుమలేశ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ చూసి అధికారులే విస్మయానికి గురయ్యారు.

అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్‌కు గురైన తిరుమలేశ్‌పై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు నెల్లూరు జిల్లా డీసీ పల్లెలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మొత్తం ఐదు చోట్ల ఈ తనిఖీలు జరిగాయి.

ఈ సోదాల్లో ఇప్పటివరకు 11 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 1.47 కిలోల‌ బంగారం, 8.77 కిలోల వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.15.26 లక్షల నగదు, ఇంట్లోని విలువైన ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా సీజ్ చేశారు. ఓ సాధారణ స్థాయి ఉద్యోగికి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సమకూరాయన్న కోణంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0
77 views