బ్యాంకర్ల సమ్మె సంపూర్ణం..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
శ్రీకాకుళం:యునైటెడ్ ఫోరం బ్యాంకు యూనియన్ పిలుపుమేరకు మంగళవారం శ్రీకాకుళంలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు.ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని స్టేట్‌బ్యాంక్, కోపరేటివ్ బ్యాంకుల వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఫోరం జిల్లా కన్వీనర్ కేసిహెచ్ వెంకటరమణ మాట్లాడుతూ.. 'కార్మిక సంఘాలకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మధ్య 2023 డిసెంబర్లో అనేక సమస్యలపై ఒప్పందం కుదిరింది.
కానీ వాటిలో కొన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. ముఖ్యంగా వారానికి ఐదు పని దినాలు మార్పు.. గత 12వ వేతన సవరణ ఒప్పందం జరిగిన ఆరునెలుల్లోగా అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం ఎక్కువైంది.
అవసరం మేరకు సిబ్బందిని నియమించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల'ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఈఎఫ్ఐ నాయకులు మండ శ్రీనివాసరావు, గ్రామీణ బ్యాంకు కార్యదర్శి బీవీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.