
సజ్జనార్‌ను టార్గెట్ చేస్తే కేసు మెత్తబడుతుందా?
సజ్జనార్ వర్సెస్ ప్రవీణ్ – బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ !
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో, విచారణాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ఈ ఆరోపణల్ని సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చేశారు. బీఆర్ఎస్ నేతగా మారిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో తనపై తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు . ముఖ్యంగా విచారణను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి నిరాధారమైన విమర్శలు చేస్తున్నట్లు సజ్జనార్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
సజ్జనార్ పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ప్రవీణ్‌కుమార్
సిట్ చీఫ్ వీసీ సజ్జనార్‌పై గతంలో 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం పట్ల సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు, వృత్తిపరమైన నిజాయితీకి భంగం కలిగించేలా ఉన్న ఈ వ్యాఖ్యలను ఆయన ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కు రెండు రోజుల గడువు
ప్రవీణ్ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకున్న సజ్జనార్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలను రెండు రోజుల్లోగా సమర్పించాలని అందులో డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఆధారాలు చూపలేకపోతే లేదా క్షమాపణలు చెప్పకపోతే, సివిల్ , క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సజ్జనార్‌ను టార్గెట్ చేస్తే కేసు మెత్తబడుతుందా?
విచారణాధికారిని టార్గెట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్రత తగ్గుతుందని బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అయితే ఇది రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు అధికారులను లక్ష్యం చేసుకోవడం సరికాదని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. మాజీ సహచరుల మధ్య మొదలైన ఈ చట్టపరమైన పోరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రవీణ్ కుమార్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారో, ఆయన దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నోటీసులకు ప్రవీణ్‌కుమార్ స్పందించాల్సి ఉంది.